
సాక్షి, సిటీబ్యూరో: బడ్జెట్‌లో గ్రేటర్ ఆర్టీసీకి అరకొర నిధులే దక్కాయి. ప్రతిరోజు సుమారు 33లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న గ్రేటర్ ఆర్టీసీ... రూ.350 కోట్లకు పైగా నష్టాల్లో కూరుకొని ఉంది. వెయ్యికి పైగా డొక్కు బస్సులే దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త బస్సుల కొనుగోళ్లకు, ఆర్టీసీ బలోపేతానికి తాజా నిధులు ఏ మాత్రం భరోసానివ్వలేవని ఆర్టీసీ కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
తెలంగాణ ఆర్టీసీకి ఈ బడ్జెట్‌లో రూ.975 కోట్లు కేటాయించినట్లు అంకెల గారెడీలు చేసినప్పటికీ... ఇందులో బస్‌పాస్‌లు, ఇతర రాయితీల కోసం కేటాయించే నిధులే ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంది. పైగా ఇవి తెలంగాణ మొత్తానికి కేటాయించిన నిధులు. ఇందులో గ్రేటర్ ఆర్టీసీకి రూ.130కోట్ల వరకు లభించవచ్చునని అంచనా. కానీ ఆ డబ్బుల్లో ఎక్కువ భాగం విద్యార్థులు, ఉద్యోగులు, జర్నలిస్టులు తదితర వర్గాల బస్‌పాస్‌లకే ఖర్చయ్యే అవకాశం ఉంది. నష్టాల బాట నుంచి గట్టెక్కే అవకాశం మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు.