
ఆఫర్ల పేరుతో సిద్ధిపేటలో ఓ వస్త్ర దుకాణం మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది.
సాక్షి, సిద్ధిపేట: ఆఫర్ల పేరుతో సిద్ధిపేట పట్టణంలో ఓ వస్త్ర దుకాణం మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. పది రూపాయలకే చీర అని ప్రకటించడంతో సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు మహిళలు భారీగా తరలివచ్చారు. సిద్ధిపేట చుట్టుపక్కల నుంచి కూడా మహిళలు తరలిరావడంతో వీరిని అదుపు చేయడం దుకాణం నిర్వాహకులకు కష్టంగా మారింది. చవక ధరలో లభ్యమయ్యే చీరలను దక్కించుకునేందుకు మహిళలు పోటీ పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ ఘటనలో 20 మంది మహిళలకు గాయాలయ్యాయి. కొంతమంది మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఓ మహిళ నుంచి దుండగులు 5 తులాల బంగారం చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, సరైన ఏర్పాట్లు చేయకుండా తమను ఇబ్బంది పెట్టిన షాపింగ్ మాల్ నిర్వాహకులపై మహిళలు మండిపడుతున్నారు. మీ వ్యాపారం కోసం మా ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.