విలీనం లేనట్లే !

stable situation on merger of villages in municipality in nalgonda - Sakshi

మున్సిపాలిటీల్లో కలిపే గ్రామాలపై యథాస్థితి

ఇటీవల ప్రతిపాదనలు పంపిన అధికారులు

ఉపాధిహామీ, పంచాయతీ ఎన్నికలే కారణం

కలపొద్దని ఎమ్మెల్యేలపై సర్పంచ్‌ల ఒత్తిడి

మున్సిపాలిటీల్లో విలీనం చేద్దామనుకున్న గ్రామాలపై వెనక్కు తగ్గినట్లు సమాచారం. విలీనం చేస్తే ఉపాధిహామీ పథకం వర్తించకపోవడం, సర్పంచ్‌ ఎన్నికలు ఉండకపోవడం.. తదితర కారణాలతో ఈ గ్రామాలను యథాస్థితిలో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నేతలు మున్సిపాలిటీల్లో కలపొద్దని స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవడంతో ప్రస్తుతానికి విలీన ప్రక్రియకు బ్రేక్‌ పడింది.

సాక్షిప్రతినిధి, నల్లగొండ  : సమీపాన ఉన్న గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపే ప్రతిపాదనలు పంపాలని ఇటీవల ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు సూచించింది. అయితే గ్రామ పంచాయతీల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. ప్రభుత్వ ఆదేశాలతో నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు సంబంధించి విలీనం చేయాలనుకునే గ్రామాల జాబితాను పంపారు. గ్రేడ్‌ 1 మున్సిపాలిటీలుగా ఉండే వాటిలో 5 కిలోమీటర్లు, గ్రేడ్‌ 2 పరిధిలోకి 3 , గ్రేడ్‌ 3 పరిధి లోకి వచ్చే వాటికి కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రా మాలను విలీనం చేసే ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం సూచించింది. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ గ్రేడ్‌ 1, నగర పంచాయతీగా ఉన్న దేవరకొండ గ్రేడ్‌ 3 కేటగిరిలో వస్తుంది. అయితే నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు 5 కిలో మీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల జాబితా ప్రతిపాదనలు అధి కారులు పంపారు. నల్లగొండ మున్సిపాలిటీలోనే ఎక్కువ గ్రామాలను విలీనం చేసే ప్రతిపాదనలు వెళ్లాయి.

ఏ మున్సిపాలిటీలోకి ఏ గ్రామాలు ..
నల్లగొండ మున్సిపాలిటీలోకి 14 గ్రామాలను విలీనం చేయవచ్చని ప్రతిపాదించారు. వీటిలో బుద్ధారం, అన్నెపర్తి, కంచనపల్లి, గుండ్లపల్లి, కొత్తపల్లి, జీకె. అన్నారం, చందనపల్లి, దండెంపల్లి, అమ్మగూడెం, మేళ్లదుప్పలపల్లి, పిట్టంపల్లి, తేందార్‌పల్లి, అనిశెట్టిదుప్పలపల్లి, ఖాజీ రామారం గ్రామాలున్నాయి. అలాగే మిర్యాలగూడ మున్సిపాలిటీలో యాద్గార్‌పల్లి, వెంకటాద్రిపాలెం, వాటర్‌ట్యాంక్‌ తండా, గూడూరు, బాధలపురం, చింతపల్లి, శెట్టిపాలెం గ్రామాలను విలీనం చేయవచ్చని పంపారు. ఇక దేవరకొండ నగర పంచాయతీ కేటగిరి ప్రకారం దీని పరిధిలోకి వచ్చే గ్రామాలు లేవని నివేదికలో పేర్కొన్నారు. వీటిని విలీనం చేస్తే ఉపాధి హామీ పథకం వర్తించదని,  సర్పంచ్‌ ఎన్నికలు ఉండవని.. తమ స్థానిక రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకమేనా..? అని స్థానిక సర్పంచ్‌లు, నేతలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. గతంలో ఈ మున్సిపాలిటీల్లో విలీనం చేసిన గ్రామాల్లోనే పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, మౌలిక వసతుల కల్పన సరిగ్గా లేకపోవడంతో.. ఇప్పుడు ఈ గ్రామాలను కలిపితే ఇదే సమస్య ఉత్పన్నమవుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్యెల్యేల దృష్టికి తెచ్చారు. పారిశుద్ధ్య సిబ్బంది కొరత, ఉపాధిహామీ పథకం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి విలీన ప్రక్రియను దూరం పెట్టినట్లు సమాచారం.

కొత్త పంచాయతీలు చేయొచ్చా..
విలీన గ్రామాల ప్రక్రియ వెనక్కు వెళ్లడంతో.. ఈ గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా చేయవచ్చా..? అనే విషయమై పరిశీలించాలని ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించింది. మైదాన ప్రాంతంలో 500 జనాభా ఉన్న, దాటిన తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదనలు అడిగితే అధికారులు పంపారు. వీటిల్లో కూడా ఇలా ఈ జనాభా పరిధిలో ఉన్న గ్రామాల ప్రతిపాదనలు పంపే పనిలో పంచాయతీ అధికారులు నిమగ్నమయ్యారు. ఇవి కొత్త పంచాయతీలు అయితే మరికొంత మంది రాజకీయ ఉపాధి దొరికినట్లే.

నగర పంచాయతీలకు ప్రతిపాదనలు..
కొత్తగా నగర పంచాయతీల ప్రతిపాదనల జాబితాలో అనుముల, చిట్యాలను చేర్చనున్నుట్లు తెలిసింది. అలాగే నకిరేకల్‌ను కూడా మున్సిపాలిటీగా చేయాలని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు తీసుకొస్తుండడంతో కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడనున్నాయి. పనిలో పనిగా కొత్త నగర పంచాయతీల ప్రక్రియ కూడా పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. చిట్యాలకు వట్టిమర్తిని కలిపి, అనుములకు ఇబ్రహింపేటను కలిపి నగర పంచాయతీలుగా చేయవచ్చని.. వాటి జనాభాను అధికారులు ప్రభుత్వానికి పంపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top