ఐటీ జోష్.. | Special zones in Nagpur Rajiv Highway Route | Sakshi
Sakshi News home page

ఐటీ జోష్..

Jul 6 2014 1:17 AM | Updated on Nov 9 2018 5:52 PM

ఐటీ జోష్.. - Sakshi

ఐటీ జోష్..

నగర శివార్లలో ఐటీ కంపెనీల విస్తృతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

* సాఫ్ట్‌వేర్ కంపెనీల విస్తృతికి బృహత్ ప్రణాళిక
* ఐటీమయం కానున్న శివారు ప్రాంతాలు
* నాగ్‌పూర్ రాజీవ్ రహదారి మార్గంలో ప్రత్యేక జోన్లు
* ఐటీఐఆర్ ప్రాజెక్టుతో సర్కారుకు కాసుల పంట
* రింగ్‌రోడ్డును కలుపుతూ 24 రేడియల్ రోడ్లు
* కంపెనీలకు సింగిల్‌విండో పద్ధతిలో అనుమతులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నగర శివార్లలో ఐటీ కంపెనీల విస్తృతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన సాఫ్ట్‌వేర్ ఆధారిత సంస్థలను మరిన్ని ప్రాంతాల్లో నెలకొల్పే దిశగా ఐటీ కారి డార్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని పరిసరాల్లో ఐటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇబ్బడిముబ్బడిగా ఐటీ దిగ్గజాలు నగరానికి తరలివస్తారని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టు ముసాయిదాలో ప్రకటించిన హబ్‌లే కాకుండా మరికొన్ని ప్రాంతాలనుఐటీ కారిడార్‌లుగా మార్చే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది.

ప్రస్తుతం గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోనే ఐటీ కంపెనీల కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అక్టోబర్‌లో ఆదిబట్లలో నిర్మిం చిన సొంత క్యాంపస్‌లోకి టాటా టెలీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ మారనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రాంగణంగా చెప్పుకుంటున్న ఈ సముదాయంలోకి ప్రస్తుతం జంటనగరాల్లో వివిధ చోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీసీఎస్ శాఖలు తరలిరానున్నాయి. తద్వారా సుమారు 25 వేల మంది ఉద్యోగులు ఇక్కడి నుంచి తమ విధులు నిర్వర్తించనున్నారు. అదే సమయంలో కాగ్నిజెంట్ కూడా త్వరలోనే ఆదిబట్లలో తమ క్యాంపస్ నిర్మాణానికి ముహుర్తం పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 
800 ఎకరాల సేకరణ
నూతన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మేడ్చల్, శామీర్‌పేట పరిసరాల్లో ఐటీ కారిడార్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఉత్తర తెలంగాణకు ముఖద్వారాలుగా పేర్కొనే రాజీవ్ రహదారి, నాగ్‌పూర్ హైవేలను కూడా పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఈ ప్రాంతాలను సాఫ్ట్‌వేర్ సంస్థల స్థాపనకు అనువుగా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో అధికారయంత్రాంగం రెండు చోట్ల కలిపి 800 ఎకరాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. జవహర్‌నగర్ ప్రాంతంలో ప్రభుత్వం భూమి ఇప్పటికే అందుబాటులో ఉండడం, మేడ్చల్‌లో 400 ఎకరాల సేకరణ పెద్ద కష్టం కాదని భావిస్తున్న అధికారులు.. ఆ దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
 
24 రేడియల్ రోడ్లు
ఐటీ ఎగుమతులతో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతుందని భావిస్తున్న ఐటీఐఆర్ ప్రాజెక్టుపై రాష్ట్ర సర్కారు ఎన్నో కలలు కంటోంది. రాష్ట్ర ఖజానాను కూడా ఇదే భర్తీ చేస్తుందని భావిస్తున్న ప్రభుత్వం.. ఐటీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా పేరొందిన సాఫ్ట్‌వేర్ సంస్థలను ఇక్కడకు రప్పించడానికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఒరాకిల్ కంపెనీతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం.. మరిన్ని సంస్థలను ఆకట్టుకునే దిశగా కార్యాచరణ రూపొందించింది.

ఈ నేపథ్యంలో బడా సంస్థల రాకకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, భూకేటాయింపులు, రాయితీల విధానం, అనుమతుల జారీని సరళతరం చేయాలని నిర్ణయించింది. సింగిల్‌విండో పద్ధతిలో అనుమతులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత ఐటీఐఆర్ కారిడార్‌లకు రోడ్డు మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. ఔటర్ రింగ్‌రోడ్డు కిరువైపులా ఐటీఐఆర్ ప్రాజెక్టులను ప్రతిపాదించినందున.. రింగ్‌రోడ్డును అనుసంధానం చేసేలా 24 రేడియల్ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు అతిత్వరలో రోడ్ల నిర్మాణం నిర్ణయం తీసుకునేదిశగా సన్నాహాలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement