కట్నం కోసం వేధిస్తున్న అల్లుడిని ప్రశ్నించటానికి వచ్చిన అత్తను బంధువులతో కలసి అల్లుడు గాయపరిచిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
నాగోలు (రంగారెడ్డి జిల్లా) : అదనపు కట్నం కోసం కూతురుని వేధిస్తున్న అల్లుడిని ప్రశ్నించటానికి వచ్చిన అత్తను బంధువులతో కలసి అల్లుడు గాయపరిచిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ నల్లకుంటకు చెందిన ఉట్లూరి లక్ష్మమ్మ పదిహేనేళ్ల క్రితం తన కూతురు రేణుకను ఎల్‌బీనగర్ గుంటి జంగయ్యనగర్‌కు చెందిన నర్సింగ్‌రావుకు ఇచ్చి వివాహం చేసింది. అయితే నర్సింగ్‌రావు అదనపు కట్నం కోసం రేణుకను గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయం అడిగేందుకు లక్ష్మమ్మ ఈ నెల 3వ తేదీన నర్సింగ్‌రావు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తులైన నర్సింగ్‌రావు, అతని కుటుంబసభ్యులు కలసి లక్ష్మమ్మపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మమ్మను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంగళవారం బాధితురాలు ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.