తుంపర్లు.. యమకింకర్లు!

Sneezing Is Main Reason To Effective For Coronavirus - Sakshi

2,600 మాట్లాడినప్పుడు సెకనుకు పడే తుంపర్లు

గాలిలో 14 నిమిషాలు చైతన్యంగా వైరస్‌

వ్యాధి ముదరకున్నా ఇతరులకు వ్యాపించే చాన్స్‌

మాస్కులే శ్రీరామరక్ష  అంటున్న శాస్త్రవేత్తలు..  

సాక్షి, హైదరాబాద్‌: మనం మాట్లాడిన ప్రతీసారి నోటి నుంచి తుంపర్లు వెలువడుతాయి. కంటికి కనిపించని సూక్ష్మపరిమాణంలో ఉండే ఈ తుంపర్లే ప్రమాదాన్ని తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తి నోటి నుంచి వెలువడిన తుంపర్లలో ఉండే వైరస్‌ దాదాపు పావుగంట వరకు బతికే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తాజా లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను చాలామంది పాటించడం లేదు. మాస్క్‌ ధరించాలి.. గుమిగూడకూడదు అన్న ప్రాథమిక హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ కరోనా బారినపడుతున్నారు. నగరంలో పలువురు వ్యాపారులు, ఉద్యోగులకు కరోనా వచ్చిన విష యం తెలిసిందే. వీరిలో కొందరు మాస్కులు సరిగా ధరించని కారణంగానే కరోనా వచ్చి ఉం టుందని వైద్యులు అనుమానిస్తున్నారు. తుంపర్ల ద్వారానే కరోనా వచ్చిందనడానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ.. వచ్చే అవకాశాలను మాత్రం కొట్టి పారేయలేమని వైద్యులు చెబుతున్నారు.

ఒక్క సెకనుకు 2,600.. : ఎవరైనా ఓ వ్యక్తి మాట్లాడినప్పుడు సెకనుకు దాదాపు 2,600 సూక్ష్మ తుంపర్లు బయటికి వస్తాయి. ఇవి కంటికి కనిపించవు. అదే నిమిషం పాటు మాట్లాడితే.. లక్షల సంఖ్యలో అవి వెలువడతాయి. అందులో దాదాపు 1,000 తుంపర్ల వరకు వైరస్‌ను మోసుకొచ్చే అవకాశముంది. ఇరుకు గదుల్లో అయితే, ఇవి దాదాపుగా 8 నుంచి 14 నిమిషాల వరకు చైతన్యంగా ఉంటాయి. ఈ క్రమంలో వైరస్‌ ఎవరికైనా సోకే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వ్యాధి సోకినా.. లక్షణాలు కనిపించని (అసింప్టోమాటిక్‌) వారితో ఈ వైరస్‌ వ్యాప్తి అధికమయ్యే ప్రమాదముందని వివరించారు. వీరిలో లక్షణాలు కనిపించకున్నా.. ఒంట్లో వైరస్‌ నోట్లోని లాలాజలం ద్వారా మాట్లాడినపుడు తుంపర్ల రూపంలో బయటికి వచ్చి కొత్త వ్యక్తులకు సంక్రమిస్తుందని హెచ్చరిస్తున్నారు. వీరు తుమ్మినపుడు లేదా దగ్గినపుడు వెలువడే ప్రమాదం ఇంకా రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే దగ్గినపుడు లిప్తపాటులో 3 వేల తుంపర్లు, తుమ్మినపుడు ఏకంగా 40 వేల వరకు తుంపర్లు వెలువడతాయట. 

పోలీసులు, వైద్యులకు వచ్చింది ఇలాగేనా.. 
తుంపర్ల ద్వారా ఫలానా వారికి కరోనా వచ్చింది అనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేకున్నా.. వచ్చే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమంటున్నారు వైద్యులు. హైదరాబాద్‌లో పోలీసులు, వైద్యులు పదుల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. వీరందరూ తగిన జాగ్రత్తలు పాటించారు. వైద్యులైతే.. పీపీఈ కిట్లు కూడా వాడారు. వీరిలో చాలామందికి అసింప్టోమాటిక్‌ వ్యక్తుల వల్లే వ్యాధి సంక్రమించి ఉంటుందని, వీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అసింప్టోమాటిక్‌ వ్యక్తుల్లో లక్షణాలు కనిపించకపోవడం వల్ల సంక్రమణకు అధిక అవకాశాలున్నాయంటున్నారు. అందుకే, తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కంటైన్మెంట్‌ జోన్లు, కోవిడ్‌ చికిత్స కేంద్రాలు, క్వారంటైన్‌ సెంటర్లలో పనిచేసే వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఎన్‌–95 మాస్కులతోపాటు పీపీఈ కిట్లు తప్పనిసరి అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top