విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్‌లకు షోకాజ్‌ జారీ

Show Cause Notice Issued To 7 Sarpanches For Neglecting Duty - Sakshi

ఇద్దరు ఉప సర్పంచ్‌లకు కూడా.. 

సాక్షి, రంగారెడ్డి: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన, అనధికార లేఅవుట్లను అరికట్టడంలో విఫలమైన ఏడుగురు సర్పంచ్‌లు, ఇద్దరు ఉప సర్పంచ్‌లకు జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి  షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. షోకాజ్‌ నోటీసులు జారీచేయడానికి దారితీసిన అంశాలను ఆమె వివరించారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్‌ మండలం చిలుకూరులో అనధికార లేఅవుట్లను నిరోధించడంలో స్థానిక సర్పంచ్‌ గునుగుర్తి స్వరూప విఫలమయ్యారు. అలాగే అదే మండలంలోని తోలుకట్టలో అక్రమ లేఅవుట్లకు, ఇంటి నిర్మాణాలకు సర్పంచ్‌ కనకమామిడి శ్రీనివాస్‌ అనుమతులు ఇచ్చారు. కనకమామిడి గ్రామంలో సర్పంచ్‌ పట్లోళ్ల జనార్దన్‌రెడ్డి.. 111 జీఓ ఉల్లంఘనలు జరిగినా పట్టించుకోలేదు. ఆయా సర్వే నంబర్ల పరిధిలో 32 ఎకరాల విస్తీర్ణంలో అనధికార లేఅవుట్లను నిరోధించడంలో విఫలమయ్యారు. సురంగల్‌ సర్పంచ్‌ గడ్డం లావణ్య కూడా ఇదే తరహాలో విఫలమయ్యారు.

కందుకూరు మండలం పులిమామిడి సర్పంచ్‌ వత్తుల అనిత.. 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేసిన పనులకు ఎలాంటి తీర్మాణాలూ, ఎంబీ రికార్డులు, ఓచర్లు, బిల్లులు లేకుండా.. పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా చెక్కులు ఇచ్చారు. మహేశ్వరం మండలం సిరిగిరిపురం సర్పంచ్‌ కాసుల సురేష్‌.. గ్రామ పంచాయతీ ఖాతాలో రూ.20.22 లక్షలు నిల్వ ఉన్నప్పటికీ నిధుల్లేవని వార్తా పత్రికల ద్వారా తప్పుడు ప్రచారం చేశారు. యాచారం మండలం మొండిగౌరెళ్లి సర్పంచ్‌ బండమీది కృష్ణ ఎంపీడీఓను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టి అధికారులను భయబ్రాంతులకు గురిచేశారు. గ్రామ పంచాయతీ పాలనలో పంచాయతీ సెక్రటరీ సహకరించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అవమానకర రీతిలో ప్రవర్తించారు. శంకర్‌పల్లి మండలం ఇర్రికుంటతండా ఉప సర్పంచ్‌ పి.లక్ష్మణ్‌.. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పనులు చేస్తుండగా పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి పంచాయతీ సెక్రటరీ విధులకు ఆటంకం కలిగించారు. జీపీ పరిధిలో గతంలో చేసిన అభివృద్ధి పనులకు, సిబ్బంది వేతనాలకు సంబంధించిన చెక్కులపై ఇదే మండలానికి చెందిన మాసానిగూడ ఉప సర్పంచ్‌ పి.వెంకటేశ్వర్‌రెడ్డి సంతకాలు చేయలేదు. వీటన్నింటిపై విచారణ జరిపిన డీపీఓ.. కలెక్టర్‌ హరీష్‌ ఆదేశాల మేరకు మంగళవారం షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top