నిరుపేద ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను ప్రవేశపెట్టింది.
నల్లగొండ :నిరుపేద ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ పథకాల ద్వారా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందలేదు. దరఖాస్తులు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభదశలోనే ఉంది.
ఇదీ పథకం ఉద్దేశం
ప్రభుత్వం షాదీముబాకర్ పథకాన్ని అక్టోబర్ 2న, కల్యాణలక్ష్మిని అదే నెలలో 21న ప్రవేశపెట్టింది. అక్టోబర్ 2వ తేదీన తర్వాత వివాహ ం చేసుకున్న అమ్మాయిలకు ఈ పథకాల ద్వా రా ఆర్థికసాయం అందించాల్సి ఉంది. ఇందుకుగాను అమ్మాయిలు వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. అమ్మాయి, అబ్బా యి తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలు మించరాదు. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉం టుంది. అన్ని అర్హతలు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన మేరకు వివాహం చేసుకున్న కుటుంబాలకు రూ. 51 వేల ఆర్థిక సాయం అందుతుంది. కానీ ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తుదారులకు ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందలేదు.
తప్పని ఎదురుచూపులు..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ పథకాలకు వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్లు పరిశీలించి ఆమోదముద్ర వేసి సంబంధిత శాఖలకు పంపించాల్సి ఉంది. కానీ నేటికీ ఆపని పూర్తి కాలేదు. ఎస్సీలకు మాత్రం ప్రభుత్వం కోటి రూపాయల నిధులు మంజూరు చేసింది. తహసీల్దార్ల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సీనియారిటీ ప్రాతిపదికన నిధులు మంజూరు చేస్తామని షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరక్టర్ వెంకటనర్సయ్య తెలిపారు. ఎస్టీ, ముస్లిం, మైనార్టీ శాఖలకు ఇంకా నిధులు విడుదల కాకపోగా, దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తిచేయకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
కల్యాణ లక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులు
ఎస్సీల నుంచి 52
తహసీల్దార్ల పరిశీలన పూర్తయినవి 4
ఎస్టీ 18
పరిశీలన పూర్తయినవి 4
షాదీముబారక్‌కు వచ్చిన దరఖాస్తులు 51
తహసీల్దార్లు పరిశీలించాల్సి ఉంది.