ఇంటింటికీ.. బడిబాట

ఇంటింటికీ.. బడిబాట - Sakshi


నేటి నుంచి ఐదు రోజుల పాటు

జిల్లాలో రెండో విడత కార్యక్రమం

ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను

పెంచేందుకు ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారంనల్లగొండ : కొత్త విద్యాసంవత్సరం సోమవారం నుంచి పునః ప్రారంభమైంది. వేసవి సెలవుల నుంచి ఉపశమనం పొందిన విద్యార్థులు నూతన విద్యాసంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొత్త ఒరవడితో పాఠశాలలకు పరుగులు తీశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలకు చెందిన 2,44,270 మంది విద్యార్థులు పాఠశాల గడప తొక్కారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు మంగళవారం నుంచి ఇంటింటికీ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నద్ధమైంది.ఉపాధ్యాయులు, కేజీబీవీల స్పెషల్‌ ఆఫీసర్లు, మండల విద్యాశాఖ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 13 నుంచి 17 వరకు ఐదు రోజుల పాటు జరిగే బడిబాట కార్యక్రమంలో ప్రధానంగా పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ పెంచడంతోపాటు సున్నా విద్యార్థులు ఉన్న పాఠశాలలు, 30 మంది విద్యార్థుల్లోపు ఉన్న పాఠశాలలు, బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంపై ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు దృష్టిసారించనున్నారు.  పాఠశాలల్లో పరిస్థితులు ఇలా...

జిల్లా వ్యాప్తంగా ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు 67 ఉన్నా యి. ఇవన్నీ అత్యధికంగా మారుమూల గిరిజన తండాల్లోనే ఉన్నాయి. 1 నుంచి 10 మంది విద్యార్థులోపున్న పాఠశాలలు 112, 11 నుంచి 20 మంది విద్యార్థులోపున్న పాఠశాలలు 189 ఉన్నాయి. ఈ పాఠ శాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలు, సబ్జెక్టు టీచర్లు కొరత ఉన్న పాఠశాలల్లో పనిచేసేందుకు 393 మంది విద్యావలంటీర్లను నియమించనుంది.మొదటి విడతలో చేరని విద్యార్థులు...

విలేజ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రిజిస్టర్‌ (వీఈఆర్‌)లో నమోదైన ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు 59,166 మంది కాగా... దాంట్లో పాఠశాలల్లో తిరిగి చేర్పించిన విద్యార్థులు 49,100 మాత్రమే. ఇంకా 10,066 మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంది. ప్రాథమికోన్నత స్థాయిలో మరొక 480 మంది విద్యార్థులను కూడా బడిలో చేర్పిం చాలి. ఇవిగాక బడిబాట పట్టని విద్యార్థులు 421 మంది ఉన్నారు.దీంట్లో 274 మందిని బడిగడప తొక్కిం చారు. వీరిలో కేజీబీవీలో 91 మంది, రెగ్యులర్‌ పాఠశాలల్లో 183 మంది విద్యార్థులు చేర్పించినట్లు రికార్డుల్లో నమోదు చేశా రు. మిగిలిన 147 మంది పిల్లలు బడిబయటే ఉన్నారు. ఇవి గాక అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు దాటిన పిల్లలు 8,946 మంది ఉన్నట్లు  గుర్తించారు. ఉపాధ్యాయులు మాత్రం అం గన్‌వాడీల్లో ఐదేళ్లు దాటిన పిల్లలు 17,004 మంది ఉన్నట్లు తేల్చారు. ఈ పిల్లలను గుర్తించడంలో ఐసీడీఎస్, విద్యాశాఖ మధ్య సమన్వయం లోపించింది. 8 వేల మంది పిల్లల విషయంలో సరైన స్పష్టత లేకపోవడంతో వారి ఎన్‌రోల్‌మెంట్‌ గందరగోళంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top