ఇసుక మాఫియాపై చర్యలేవీ !

Sand Mafia In Nizamabad District - Sakshi

ఐఏఎస్‌ అధికారిపై దాడి జరిగినా మీనమేషాలు

సరి‘హద్దులు’దాటి దోపిడీ చేçస్తున్నా చోద్యం చూస్తున్నారు..

కేసు నమోదుతో చేతులు దులుపుకున్న పోలీసులు

మహారాష్ట్ర క్వారీ నిర్వాహకుల జోలికెళ్లకపోవడంపై ఆరోపణలు

కలకలం రేపిన సబ్‌కలెక్టర్‌ బృందంపై దాడి ఘటన

‘మహా’ క్వారీ నిర్వాహకులకు తెలంగాణ నేతల అండదండలు?

మహారాష్ట్రలోని శాఖాపూర్‌ ఇసుక క్వారీ నిర్వాహకులు మంజీర నదిలోని మన భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తున్నారు. ఇటీవల అడ్డుకునేందుకు వెళ్లిన బోధన్‌ సబ్‌కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి నేతృత్వంలోని రెవెన్యూ అధికారుల బృందంపైనే ఇసుక మాఫియా దాడికి పాల్పడింది. జిల్లా పోలీసు యంత్రాంగం మాత్రం కేసుల నమోదుకే పరిమితమైంది. ఇసుక మాఫియాకు తెలంగాణ కు చెందిన బడా నేతల అండదండలుండటంతోనే కేసు పురోగతి లేదనే విమర్శలు వస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: బరితెగించిన మహారాష్ట్ర ఇసుక మాఫియా సాక్షాత్తు ఓ ఐఏఎస్‌ అధికారిపైనే రాళ్లదాడికి పాల్పడింది. ఏకంగా రాష్ట్ర సరిహద్దులు దాటి మన జిల్లా భూ భాగంలోకి చొచ్చుకువచ్చి యథేచ్ఛగా ఇసుక తోడేస్తోంది. ఇసుక మాఫియా ఇంత బరితెగిస్తుంటే ఉక్కుపాదం మోపాల్సిన జిల్లా పోలీసుశాఖ మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక ఉన్న ఆంతర్యమేంటనే విమర్శలు వస్తున్నాయి. కేవలం కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్న జిల్లా పోలీసుశాఖ ఇప్పటి వరకు క్వారీ కాంట్రాక్టర్‌ జోలికి మాత్రం వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. మహారాష్ట్రలోని శాఖాపూర్‌ ఇసుక క్వారీ నిర్వా హకులు కోటగిరి మండలం సుంకిని వద్ద మన భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తోడేస్తున్నా రు.

జాతర తరహాలో లారీల్లో ఇసుక దోపిడీ జరుగుతున్నట్లు సమాచారం తెలుసుకున్న యువ ఐఏఎస్‌ అధికారి, బోధన్‌ సబ్‌కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి నేతృత్వంలో పకడ్బందీగా రెవెన్యూ అధికారుల బృందం నదిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. జిల్లా భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తవ్వుతున్న జేసీబీలు, టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలోనే ఇసుక మాఫియా ఏకంగా యువ ఐఏఎస్‌ అధికారిపై సామూహికదాడికి పాల్పడింది. ఈ ఘటన జరిగి పక్షం రోజులు గడుస్తున్నప్పటికీ ఈ కేసులో పోలీసుశాఖ పనితీరు కనీస పురోగతి కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఘటన జరిగిన శాఖాపూర్‌ ఇసుక క్వారీ నిర్వాహకులు, తెలంగాణకు చెందిన బడా నేతల పలుకుబడి కలిసి పోలీసుశాఖ చేతులు కట్టేసిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

మహారాష్ట్ర మంత్రి అండదండలతో..
ఇసుక నుంచి రూ.కోట్లు దండుకోవడానికి అలవాటు పడిన రాష్ట్రానికి చెందిన ఇసుక మాఫియా మంజీర నదిలో తెలంగాణ భూభాగం ఇసుక నిల్వలపై కన్నేసింది. తన దోపిడీని యథేచ్ఛగా కొనసాగించేందుకు మహారాష్ట్రలో ఓ మంత్రితో చేతులు కలిపింది. నదిలో అటు వైపు అసలు ఇసుకే లేదు. అక్కడి ఇసుక నిల్వలు ఎప్పుడో తోడేశారు. మిగిలింది తెలంగాణ భూభాగంలోనే. లేని చోట ఇసుక నిల్వలు ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి., టెండర్లు నిర్వహించేలా నాందేడ్‌ జిల్లా అధికార యంత్రాంగంపై మహారాష్ట్ర మంత్రితో ఒత్తిడి చేయించారు. ఈ మేరకు క్వారీని దక్కించుకుని తెలంగాణ భూభాగంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీకి తెరలేపారు. పైగా మహారాష్ట్ర క్వారీల పేరుతో జిల్లా భూభాగంలో తవ్విన ఇసుకను హైదాబాద్‌కే తీసుకువచ్చి విక్రయించడం గమనార్హం.

తెలంగాణ చోటామోటా నాయకులకు సైతం..
తెలంగాణ భూభాగంలోని ఇసుక నిల్వలను దోపిడీ చేస్తున్న ఇసుక మాఫియా కేవలం మహారాష్ట్ర వైపు ఉన్న గ్రామస్తులకే కాకుండా, తెలంగాణ వైపు ఉన్న గ్రామాల్లోని కొందరు స్థానిక నేతలకు కూడా డబ్బులు వెదజల్లుతున్నారు. ఆయా క్వారీలకు తెలంగాణ వైపు ఉన్న మన గ్రామాల్లో కీలకంగా వ్యవహరించే చోటామోటా నాయకులకు పెద్ద మొత్తంలో సమర్పించుకుని తమ దందాకు అండగా నిలిచేలా పావులు కదుపుతున్నారు. ఇలా తెలంగాణ ఇసుకనే, తెలంగాణలోనే విక్రయించి పెద్ద మొత్తంలో దండుకోవడం గమనార్హం. 

19 తర్వాత అరెస్టు చేస్తాం..
ప్రస్తుతం రెవెన్యూ యంత్రాంగం రైతుబంధు చెక్కుల పంపిణీలో తలమునకలై ఉంది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే రెవెన్యూ అధికారులతో కలిసి శాఖాపూర్‌ వెళ్లి దాడులకు పాల్పడిన వారిని గుర్తిస్తాం. వారిని అరెస్టు చేసి విచారించిన తర్వాతే క్వారీ నిర్వాహకులను అరెస్టు చేసేందుకు వీలు కలుగుతుంది.– రాజ్‌భరత్‌రెడ్డి, కోటగిరి ఎస్‌ఐ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top