
సెలైన్ బాటిల్స్ వాపస్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, బోధనాసుపత్రులకు సరఫరా చేసిన వివిధ రకాల ఐవీ ఫ్లూయిడ్స్ సెలైన్ బాటిళ్లను వెనక్కి తెప్పించాల్సిందిగా తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) అత్యవసర ఆదేశాలు ఇచ్చింది.
► ప్రభుత్వాసుపత్రుల నుంచి వెనక్కి తెప్పించండి
► సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌కు వైద్య శాఖ అత్యవసర ఆదేశాలు
► ఇటీవల బాలింతల మరణంతో అనుమానాలు..
► 3.5 లక్షల బాటిల్స్ వెనక్కి వచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, బోధనాసుపత్రులకు సరఫరా చేసిన వివిధ రకాల ఐవీ ఫ్లూయిడ్స్ సెలైన్ బాటిళ్లను వెనక్కి తెప్పించాల్సిందిగా తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లా సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల ఫార్మసిస్టులకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ వేణుగోపాల్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. అత్యవసర ఆదేశంతో మొత్తం 8 రకాల ఐవీ ఫ్లూయిడ్స్‌ను వెనక్కి రప్పిస్తున్నారు.
ఇటీవల నీలోఫర్, తాజాగా సుల్తాన్‌బజార్ ఆసుపత్రుల్లో బాలింతల మరణాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకు వెనక్కు రప్పిస్తున్నారన్న సమాచారాన్ని మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. ఇటీవల చనిపోయిన బాలింతలకు ఈ ఐవీ ఫ్లూయిడ్ సెలైన్లను వాడారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలింతలకు ఇన్‌ఫెక్షన్లు వచ్చినప్పుడు ఈ ఐవీ ఫ్లూయిడ్స్‌ను వాడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆగమేఘాలపై అత్యవసర ఉత్తర్వులు జారీచేసినట్లు ప్రచారం జరుగుతోంది.
3.5 లక్షలకుపైనే..
ఐవీ ఫ్లూయిడ్స్‌ను వివిధ సందర్భాల్లో రోగులకు వాడతారు. వాటిల్లో అనేక రకాలున్నాయి. కొన్ని సాధారణ ఐవీ ఫ్లూయిడ్స్‌ను డయేరియా, జ్వరంతో బాధపడుతున్న వారికి వాడతారు. యాంటీబయోటిక్ ఐవీ ఫ్యూయిడ్స్‌ను శస్త్రచికిత్సలు చేశాక ఇన్‌ఫెక్షన్లు సోకినప్పుడు ఉపయోగిస్తారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఇప్పుడు వెనక్కి రప్పించాలని ఆదేశించిన వాటిల్లో అనేకం శస్త్రచికిత్సలు జరిగినప్పుడు ఉపయోగించే ఐవీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులకు 8 రకాల ఐవీ ఫ్లూయిడ్స్‌ను సరఫరా చేశారు.
పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ వంటి బోధనాసుపత్రులన్నింటా కలిపి మొత్తం 3.5 లక్షలకు పైనే ఈ సెలైన్ బాటిళ్లు నిల్వ ఉన్నట్లు సమాచారం. వీటి విలువ మార్కెట్లో రూ.4–5 కోట్ల మధ్య ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ ఆగమేఘాలపై వెనక్కు తెప్పించాలని ఆదేశించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటివల్ల ఎంత మందికి ఇతరత్రా దుష్ప్రభావాలు కలిగాయో సమాచారం లేదు. టీఎస్‌ఎంఎస్‌ఐడీ వర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు.
టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ గత చరిత్ర చూస్తే...
నాసిరకం మందులను ఆసుపత్రులకు పంపి తిరిగి వెనక్కు తెప్పించిన చరిత్ర టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి ఉంది. అలా తప్పిదాలు చేసిన వాటిల్లో కొన్ని...
– గతేడాది మార్చిలో 24,456 సీసాల (మూడు బ్యాచ్‌ల్లో) కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్‌ను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఓ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. వాటిని సరోజినీ కంటి ఆసుపత్రి సహా వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేసింది. సరోజినీ కంటి ఆసుపత్రిలో ఈ మందును గతేడాది జూన్ 30న జరిగిన శస్త్రచికిత్సల సమయంలో 13 మంది రోగులకు వినియోగించారు. ఆ మరుసటి రోజున రోగులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. కొందరు కంటిచూపు కోల్పోయారు.
– 1.12 లక్షల ‘ఆన్‌డాన్‌సెట్రాన్ 4 ఎంజీ’మాత్రలను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ 2015 జనవరిలో ఒక సంస్థ నుంచి కొనుగోలు చేసి వివిధ ఆసుపత్రులకు పంపించింది. అప్పటివరకు వాటికి సంబంధించిన నాణ్యత నివేదిక రాలేదు. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వ ఔషధ నియంత్రణ ప్రయోగశాల ఆ మందులు నాణ్యమైనవి కావని, వెనక్కు పంపాలని డిసెంబర్‌లో ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ అప్పటికే ఆసుపత్రులు చాలావరకు వాటిని వినియోగించాయి.
– 51 వేల ‘ఈనలప్రిల్ మాలెట్ 5 ఎంజీ’మాత్రలను 2015 ఏప్రిల్, నవంబర్ మధ్య హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి సరఫరా చేసింది. అప్పటికి ఇంకా నాణ్యత నివేదిక రాలేదు. ఈ మందులు నాణ్యమైనవి కావని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ 2016 ఏప్రిల్‌లో తెలిపింది. అప్పటికే 44,400 మాత్రలను రోగులకు అందజేశారు. మిగిలిన 6,600 మాత్రలను మాత్రమే తిప్పి పంపారు.
వాటిని బాలింతలకు ఉపయోగించలేదు: టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ
వెనక్కి తెప్పించే ఐవీ ఫ్లూయిడ్స్ సెలైన్ బాటిళ్లను సుల్తాన్‌బజార్‌లో ఇటీవల చనిపోయిన బాలింతలకు ఉపయోగించలేదు. అంతర్జాతీయ బ్రాండ్ కలిగిన కొత్త ఐవీ ఫ్లూయిడ్స్ స్టాక్ వచ్చినందునే వీటిని వెనక్కి తెప్పిస్తున్నాం. వీటిపై ఎటువంటి ఫిర్యాదులు లేవు. ముందస్తుగా వెనక్కు తెప్పిస్తున్నాం. పైగా చాలావరకు కాలం తీరే దశకు చేరుకున్నాయి.