ఆన్‌లైన్‌ విద్య.. ఒక భాగం  మాత్రమే! 

Sakshi Special Interview With DK Goyal About Online Education

ఆఫ్‌లైన్‌ ప్రాధాన్యం ఎప్పటికీ ఉంటుంది

మానవ విలువలు, నైపుణ్యాలు దాంతోనే సాధ్యం

మన విద్యా విధానం, పాఠ్యాంశాలు మారాలి

ఇంజనీరింగ్‌ వేగంగా వృద్ధి చెందుతోంది

‘సాక్షి’తో ఫిట్‌జీ చైర్మన్‌ డీకే గోయల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. అంతా ఆన్‌లైన్‌ క్లాసులు దాదాపుగా మొదలెట్టేశారు. మరి ఇది సరైన ప్రత్యామ్నాయమేనా? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇలాంటి అంశాలపై ప్రముఖ శిక్షణ సంస్థ ఫిట్‌జీ (ఎఫ్‌ఐఐటీ జేఈఈ) చైర్మన్, చీఫ్‌ మెంటార్‌ డీకే గోయల్‌ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా...

సాక్షి: మారుతున్న అవసరాలకు ప్రస్తుత విద్యా విధానం కరెక్టేనా? 
డీకే గోయల్‌: ఒకరకంగా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఓ వైపు నిరుద్యోగం పెరుగుతోంది. మరోవైపు కంపెనీల అవసరాలను తీర్చే నిపుణులు లభించటంలేదు. ఇంకోవైపు చూస్తే మన వద్ద అద్భుతమైన మేధస్సుంది. దాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలి. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యావిధానంలో, పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలి. అప్పుడే విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగవుతాయి. మన సంప్రదాయ విద్యా విధానంలో.. సమస్య పరిష్కరించే నైపుణ్యం బదులు ఒత్తిడి చేసి కోర్సు పూర్తి చేయాలనుకుంటారు. దీనివల్ల నైపుణ్యాలు సాధించలేం. టెక్నాలజీకి తగ్గట్టు మన విద్యావ్యవస్థను మార్చాలి.

గడిచిన రెండు దశాబ్దాలుగా ఇంజనీరింగే ఎక్కువ మంది కెరీర్‌ ఆప్షన్‌!. ఎందుకంటారు? 
టెక్నాలజీ పెరుగుతోంది. కొత్త ఆవిష్కరణలకు ఇంజనీరింగే కేంద్ర బిందువు. పైగా ఇది నిజ జీవిత సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది. గత రెండు దశాబ్దాల్లో చూసినా ఇంజనీరింగ్‌ చాలా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఇందులో ఐదారు బ్రాంచ్‌లకు మించి లేవు. ఇప్పుడు 50కి పైగా స్పెషలైజేషన్స్‌ ఉన్నాయి. దానికి తగ్గట్టే అవకాశాలూ పెరుగుతున్నాయి. అందుకే యువత ఇంజనీరింగ్‌ను ఎంచుకుంటున్నారు.  

భవిష్యత్‌లో కృత్రిమ మేధ (ఏఐ) మానవ అవసరాలను తీరుస్తుందా? మన విద్యా విధానం దానికి తగ్గట్లుందా? 
భవిష్యత్‌లో మానవ అవసరాలను కృత్రిమ మేధ తీర్చగలదనే ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈ టెక్నాలజీ అనేక వ్యాపార అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది. దాంతో పరిశ్రమలు మరింత సమర్థవంతమైన, ప్రత్యేకమైన స్కిల్స్‌ ఉన్న వారినే కోరుకుంటాయి. అలాంటి వారికే అవకాశాలు లభిస్తాయి.

మరి ప్రస్తుత ఆన్‌లైన్‌ బోధనా విధానం క్లాస్‌రూమ్‌ బోధనను దెబ్బతీస్తుందా?  
ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ మనకు ఒక వరమనే చెప్పాలి. అయితే ఇది క్లాస్‌ రూమ్‌ బోధనను దెబ్బతీస్తుందని అనుకోలేం. సంప్రదాయ తరగతి గది బోధన దాని ప్రాధాన్యాన్ని కోల్పోదు. ఎందుకంటే.. క్లాస్‌ రూమ్‌ ద్వారా మాత్రమే విద్యార్థులు మానవ విలువలు, నైపుణ్యాల గురించి తెలుసుకుంటారు. ఆన్‌లైన్‌ క్లాసులు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ.. క్రమశిక్షణ, నైతిక విలువలు వంటివి ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా నేర్పించలేం. విద్యార్థులు కూడా తరగతి గది బోధననే ఇష్టపడతారు. కాబట్టి ఆన్‌లైన్‌ తరగతులు విద్యా వ్యవస్థలో ఒక భాగంగా ఉంటాయే తప్ప.. ఆఫ్‌లైన్‌ బోధనను దెబ్బతీయడం జరగదు.

ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కాన్సెప్ట్యువల్‌ లెర్నింగ్‌ ముఖ్య పాత్ర పోషిస్తుందా? 
ఇప్పుడే కాదు.. మేమెప్పుడూ కాన్సెప్ట్యువల్‌ లెర్నింగ్‌కే ప్రాధాన్యమిస్తున్నాం. ఈ విధానంలో.. ఏది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. వాస్తవాలను తెలుసుకున్నా.. భావనలను వివరించలేకపోతే అది స్వల్పకాలిక జ్ఞానమే కదా!!. విద్యార్థులకు కాన్సెప్ట్స్‌పై దృఢమైన అవగాహన ఉంటే.. వారు సొంతంగా ప్రాక్టీస్‌ చేయగలుగుతారు. అందుకే ఫిట్‌జీ మొదటి నుంచీ కాన్సెప్ట్యువల్‌ లెర్నింగ్‌నే అనుసరిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top