ఆమె రాష్ట్రానికి హోం మినిస్టర్

Sabitha Indra Reddy First Home Minister of AP - Sakshi

భర్త ఆకస్మిక మరణం ఆమెను ఊహించని దారిలోకి నెట్టింది. రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో శరవేగంగా ఎదిగిన యువ నాయకుడు పట్లోళ్ల ఇంద్రారెడ్డి. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన భార్య సబిత రాజకీయాల్లోకి రావలసి వచ్చింది. నలుగురిని పలకరిస్తూ అప్పటివరకు ఒక గృహిణిగా ఎంతగానో ఆదరణ పొందిన ఆమెకు ఇంద్రారెడ్డి మరణంతో కోలుకోలేని దెబ్బతగిలింది. గృహిణి పాత్ర నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె అసలు రాణిస్తారా? అన్న సందేహం ఆరోజుల్లో చాలా మందికే వచ్చింది. అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 
2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి మరణించడంతో చేవెళ్ల నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఆమె నియోజకవర్గం ప్రజలతో మమేకమయ్యారు.

ఆ తర్వాత 2004 లో జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. రాజశేఖరరెడ్డి హయాంలో తొలిసారి రాష్ట్ర మంత్రిగా పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన అవకాశంతో ఆమె ఏకంగా హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో భర్త ఇంద్రారెడ్డి  హోం శాఖ నిర్వహించగా, వైఎస్ హయాంలో సబిత సైతం హోం శాఖ నిర్వహించడం విశేషం. 2008 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల ఎస్సీ రిజర్వుడ్ గా మారడంతో 2009 లో ఆమె మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సాహసోపేతమైన తన పాదయాత్రను చేవెళ్ల నుంచే ప్రారంభించారు. ఒక చెల్లిగా సబితపైన చూపిన అభిమానంతో వైఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా చెల్లెమ్మె చేవెళ్ల నుంచి ప్రారంభించడం కూడా సబిత రాజకీయ కీర్తి మరింత పెరిగింది. ఈ కారణంగానే ఆమెకు చేవెళ్ల చెల్లెమ్మగా కూడా పేరొచ్చింది. 2014 ఓటమిని చవిచూసిన సబితా ఇంద్రారెడ్డి ఈసారి మహేశ్వరం నుంచి మళ్లీ బరిలో నిలిచారు. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. 

కుటుంబ నేపథ్యం :
భర్త  : పి. ఇంద్రారెడ్డి (1954 - 2000)
పుట్టిన తేదీ : 5 మే 1963
కుటుంబం : ముగ్గురు కుమారులు
స్వస్థలం :  కౌకుంట్ల గ్రామం, చేవెళ్ల జిల్లా
నేపథ్యం : ఎన్టీ రామారవు కేబినేట్‌లో మంత్రిగా పని చేసిన ఇంద్రారెడ్డిని సబిత వివాహమాడారు
విద్య  : బీఎస్సీ 

రాజకీయ జీవితం : 
- 2000 చేవెళ్ల ఉపఎన్నిక విజయం సాధించి రాజకీయ రంగ ప్రవేశం
- 2004 నుంచి 2009 చేవెళ్ల నుంచి ఎమ్మెల్యేగా
- 2009 నుంచి 2014 మహేశ్వరం నుంచి ఎమ్మెల్యేగా 

- పి సృజన్ రావు (ఎస్ ఎస్ జె)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top