ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నికలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో మంచి మెజార్టితో గెలుపు సొంతం చేసుకుంటామన్నారు. ‘ జూబ్లిహిల్స్ లో 46 వేల ఇళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
రాష్ట్రంలో పరిస్థితులు అన్నింటిని హైకమాండ్ అన్ని గమనిస్తుంది. అందరం హైకమాండ్ రాడార్ లో ఉన్నాం. మంత్రుల పంచాయతీ ముగిసిన అధ్యాయం. ఎవరైనా, ఎక్కడైనా కులాల గురించి, మతాల గురించి మాట్లాడటం ఆక్షేపణీయం. గోడలకు చెవులు ఉండే సమయం. జాగ్రత్తగా మాట్లాడాలి. కొంతమంది ఎమ్మెల్యేలకు డిసిసి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు డిసిసి బాధ్యతలు తీసుకోవడం మంచిది. ఎమ్మెల్యేలకు డిసిసి పదవులు డబుల్ పోస్టులుగా చూడం.
కుటుంబాలు అంటే అప్పటికే పార్టీలో ఉండి, సర్వీస్ చేస్తుంటే అడ్డంకి ఉండదు. ఉన్నపళంగా తెరపైకి వచ్చి పోస్టులు అడిగితే ఇవ్వరు. నేను పార్టీలో ఉన్నా.. నాకొడుకు ఇప్పటిప్పుడు వచ్చి పోస్ట్ అడిగితే ఇవ్వరు. రెండు పదవులు ఉండొద్దు అనే నిబంధన ఉంది. ఒక పదవికి సెలెక్ట్ అయితే, ఇంకో పదవికి రాజీనామా చేస్తారు. కేంద్రం నుంచి సరైన విధంగా రాష్ట్రానికి సహకారం లేదు. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చెయ్యాలి. మెట్రో ఫేస్ టూకు కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారు. కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా?,’ అని ప్రశ్నించారు.


