ఖాతాల్లోకే రైతుబంధు..

Rythu Bheema Scheme Money Transfer Farmers Account Warangal - Sakshi

హన్మకొండ: యాసంగి పెట్టుబడి నేరుగా రైతు ఖాతాల్లో జమకానుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులపై పెట్టుబడి భారం పడకుండా ఉండేందుకు గత ఖరీఫ్‌ నుంచి ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున అందిస్తోంది. ఖరీఫ్‌లో చెక్కులను పంపిణీ చేయగా.. ఈ యాసంగిలోనూ అదే తరహాలో ఇచ్చేందుకు సన్నద్ధమైంది. అయితే.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఈ విధానానికి ఎన్నికల కమిషన్‌ అభ్యంతరాలు తెలిపింది.

గతంలో ఇచ్చిన రైతులకు మాత్రమే యాసంగిలో రైతుబంధు పథకం అమలు చేయాలని, కొత్త వారిని మినహాయించాలని ఈసీ సూచించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో గత ఖరీఫ్‌లో చెక్కులు పొందిన రైతులకు యాసంగికి గాను నేరుగా వారి ఖాతాల్లో సొమ్ము జమచేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి 25వ తేదీ వరకు వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల ఇంటికి వెళ్లి బ్యాంకు ఖాతా నంబర్లు, ఇతర వివరాలు సేకరించనున్నారు. దీని కోసం నిర్ధిష్టమైన ప్రొఫార్మాను సిద్ధం చేశారు. రైతుల నుంచి సేకరించిన వివరాలు ఇందులో పొందుపరచనున్నారు.

74,664 మంది రైతులకు..
యాసంగికి సంబంధించి అర్బన్‌ జిల్లాలో 74,664 మంది రైతులకు 75,825 చెక్కుల రూపంలో రూ.69,12,56,170 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాల్లో వేయనున్నారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో 75,085 మంది రైతులకు 75,540 చెక్కుల రూపంలో రూ.67,63,09,650 పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇందులో వివిధ కారణాలతో 6,756 మంది రైతులకు 6,817 చెక్కులు పంపిణీ కాలేదు. ఎన్నారైలు, చనిపోయిన రైతులు, డబుల్‌ జారీ అయిన వారు, వివాదాల్లో ఉన్న వారు మిగిలిపోయారు.

అడ్డంకులు తొలగిపోయినా దూరమే..
గతంలో అన్ని సక్రమంగా ఉన్న ‘ఏ’ గ్రూపు రైతులకు మాత్రమే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందించారు. సమస్యలుండి పాస్‌ బుక్కులు అందుకోని రైతులను బీ గ్రూపులో చేర్చి వారికి చెక్కులు అందించలేదు. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయి కొత్తగా పాస్‌ బుక్కులు అందుకున్న రైతులు ఉన్నారు. అయితే ఈ యాసంగిలో కొత్త వారికి రైతుబంధు పథకం అమలు చేయొద్దని ఎన్నికల కమిషన్‌ నిబంధనలు విధించింది. దీంతో కొత్త రైతులు యాసంగి పెట్టుబడికి దూరం కానున్నారు.

వివరాలు అందజేయాలి..
ఇంటికి వచ్చే వ్యవసాయ విస్తరాణాధికారులకు రైతులు పూర్తిస్థాయిలో వివరాలు అందజేయాల్సి ఉంటుంది. నిర్ణీత ప్రొఫార్మాలో ఉన్న అంశాల మేరకు వివరాలు అందించాలి. బ్యాంకు ఖాతా వివరాలు, కొత్తగా జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌ ప్రతి, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ప్రతి, రైతు ఫోన్‌ నంబర్‌ను అధికారులకు ఇవ్వాలి. పెట్టుబడి సొమ్ము రైతుల ఖాతాల్లోకి వెళ్లగానే ఫోన్‌ నంబర్‌కు సమాచారం వస్తుందని వ్యవసాయ అధికారులు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top