రిజర్వుబ్యాంకు ద్వారా రైతుబంధు సొమ్ము 

Rythu bandhu money by Reserve Bank - Sakshi

  అక్కడి నుంచే నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ 

  పెట్టుబడి సొమ్ము పంపిణీపై వ్యవసాయశాఖ కీలక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: పెట్టుబడి సొమ్మును నేరుగా రిజర్వుబ్యాంకు ద్వారా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకేసారి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడానికి వీలుపడుతుంద ని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రైతులకు 64 బ్యాంకుల్లో ఖాతాలున్నాయి. ఒక్క ఎస్‌బీఐ వద్దే 11 లక్షల రైతు ఖాతాలున్నాయి. మిగిలినవి వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. దీంతో రైతులందరి ఖాతా నంబర్లను సేకరించి ఒక్కో బ్యాంకుకు అందజేయడం క్లిష్టమైన పని. ఒక్కో బ్యాంకుకు ప్రభుత్వం సొమ్ము సరఫరా చేయడమూ ఇబ్బందేనని వ్యవసాయశాఖ అంచనా వేసింది. బ్యాంకులకు సొమ్ము ఇచ్చాక అవి రైతులకు సక్రమంగా పంపిణీ చేశాయా లేదా తెలుసుకునేందుకు ప్రతీ బ్యాంకును పర్యవేక్షించాల్సి ఉంటుంది.

ఈ ఇబ్బందులన్నింటికీ రిజర్వుబ్యాంకు ద్వారా సొమ్మును జమచేయడమే పరిష్కారంగా వ్యవసాయశాఖకు కన్పించింది. ఇక రైతు ఖాతాలన్నింటినీ రిజర్వుబ్యాంకు ఇస్తే వివిధ బ్యాం కులతో సంబంధం లేకుండా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి సొమ్ము చేరిపోతుంది. అంటే ఏ బ్యాంకు ఖాతాకైనా రిజర్వుబ్యాంకు నుంచి సొమ్ము ఏకకాలం లో వెళ్లిపోతుంది. అందుకే దీనికి సంబంధించి రిజర్వుబ్యాంకు ఉన్నతాధికారులతో బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రిజర్వుబ్యాంకు ద్వారా రైతు ఖాతాలకు సొమ్ము అందజేస్తే ఎక్కడా అవకతవకలు జరిగే వీలుండదంటున్నారు.  

ఏకకాలంలో ఖాతాల సేకరణ, సొమ్ము జమ  
ప్రస్తుతం వ్యవసాయశాఖ రైతు ఖాతాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. నెలాఖరు నాటికి రైతు బ్యాంకు ఖాతాలన్నింటినీ సేకరించాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, కమిషనర్‌ రాహుల్‌బొజ్జాలు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 52 లక్షల మంది రైతుల నుంచి బ్యాంకు ఖాతాలను, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను సేకరించాలని నిర్ణయించారు. ఒకవైపు రైతు బ్యాంకు ఖాతాలను సేకరిస్తూనే, వాటన్నింటినీ ఎప్పటికప్పుడు రిజర్వుబ్యాంకుకు అందజేస్తారు. అంతే మొత్తంలో సొమ్మును కూడా అందజేస్తారు. మరోవైపు తమ వద్దకు వచ్చిన ఖాతా నంబర్ల ప్రకారం రిజర్వుబ్యాంకు సంబంధిత సొమ్మును రైతులకు జమ చేస్తుంది. రైతు బ్యాంకు ఖాతా నంబర్ల సేకరణ, వాటిల్లోకి సొమ్ము జమ రెండూ ఏకకాలంలో జరగాలని నిర్ణయించారు.  

సవాలుగా మారిన ఖాతాల సేకరణ 
ఇదిలావుంటే వ్యవసాయశాఖ వద్ద ప్రస్తుతం 33 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు ఉన్నాయి. కానీ, అవి ఏమేరకు సరైనవో అన్న అనుమానాలున్నాయి. ఎస్‌బీఐ వద్ద ఉన్న 11 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడు లక్షల ఖాతాలే సరిగా ఉన్నాయి. మిగిలిన 4 లక్షల ఖాతాల్లో తప్పులున్నట్లు గుర్తించారు. అందువల్ల ప్రతీ రైతు బ్యాంకు ఖాతాను సేకరించాలని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు వ్యవసాయశాఖకు సవాలుగా మారింది. ప్రతీ రైతు వద్దకు వెళ్లి సేకరించడం మండల వ్యవసాయ విస్తరణాధికారులకు కీలకంగా మారింది. గ్రామాల్లో ఉండే రైతుల నుంచి సేకరించడమైతే సులువే కానీ, ఎక్కడో పట్టణాల్లో ఉండే వారి బ్యాంకు ఖాతాలను సేకరించడం ఎలాగన్న ప్రశ్న అధికారులను తొలుస్తోంది. ఎలాగైనా సేకరించి పెట్టుబడి సొమ్మును రైతు ఖాతాల్లో జమ చేయాల్సిందేనన్న సంకల్పంతో వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top