వాహనం విక్రయించారా? అందుకు మీరే బాధ్యత | RTA Awareness on Vehicle Transfer Registrations | Sakshi
Sakshi News home page

మార్పిడి మరిస్తే అంతే!

May 25 2019 8:05 AM | Updated on May 29 2019 11:46 AM

RTA Awareness on Vehicle Transfer Registrations - Sakshi

సదరు వాహనాలు అసాంఘిక వ్యక్తుల చేతుల్లో పడి నేరాల కోసం వినియోగించినా, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినా.. అందుకు మీరే మూల్యం చెల్లించాల్సి రావచ్చు.

సాక్షి, సిటీబ్యూరో: సొంత వాహనం విక్రయించారా? అయితే యాజమాన్య మార్పిడి మరిచారో ముప్పు పొంచి ఉన్నట్లే! సదరు వాహనాలు అసాంఘిక వ్యక్తుల చేతుల్లో పడి నేరాల కోసం వినియోగించినా, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినా.. అందుకు మీరే మూల్యం చెల్లించాల్సి రావచ్చు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో లక్షలాది మంది వాహనదారులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాహనాలను విక్రయించిన తరువాత కొనుగోలు చేసిన వారి పేరిట యాజమాన్యం మార్పిడి జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనం అమ్మేసిన తరువాత చాలామంది వాహనదారులు ఆర్టీఏ పత్రాలపై (ఫామ్‌ 29, 30) సంతకాలు చేస్తే తమ పని పూర్తయినట్లు భావిస్తారు. కానీ రవాణాశాఖ అధికారుల సమక్షంలో కచ్చితంగా విక్రయించిన వారి నుంచి కొనుగోలు చేసిన వారి పేరిట ‘యాజమాన్య మార్పిడి’ జరగాల్సిందే.

అలా కాకుండా  కేవలం పత్రాలపైన సంతకాలు చేస్తూ ఒకరి నుంచి మరొకరికి వాహనాలు విక్రయిస్తూ పోతే చివరకు ఆ వాహనాలపైన జరిగే అన్ని రకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలపైన అసలు యజమానికి ఇబ్బందులు తప్పవు. రవాణాశాఖ  వెబ్‌సైట్‌లో వాహనం ఎవరి పేరిట ఉంటే వారినే యజమానిగా గుర్తిస్తారు. నగరంలో ఇలా విక్రయించినప్పటికీ యాజమాన్యం బదిలీ కాకుండా సుమారు 10లక్షలకు పైగా వాహనాలు ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంఘటనల్లో పోలీసులు, రవాణా అధికారులు స్వాధీనం చేసుకున్న వాహనాలకు, ఆ క్షణం వరకు వాటిని వినియోగిస్తున్న వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉండడం లేదు. వాహనాలు అమ్మిన వెంటనే యాజమాన్య బదిలీ చేయడం లేదు. అలాగే కొనుగోలు చేసిన వాళ్లు కూడా తమ పేరిట తిరిగి నమోదు చేసుకోవడం లేదు.  

భారీ మూల్యం తప్పదు...
కార్లు, మోటారు బైక్‌లు వంటి వ్యక్తిగత వాహనాలు, ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, ప్రైవేట్‌ బస్సులు తదితర రవాణా వాహనాలు ప్రతి రోజు వేల సంఖ్యలో ఒకరి నుంచి ఒకరికి చేతులు మారుతాయి. సెకండ్‌హ్యాండ్స్‌ అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు సుమారు 1,000 వరకు పాత వాహనాల క్రయవిక్రయాలు జరుగుతాయి. కానీ వాహన యాజమాన్య బదిలీ కోసం ఆర్టీఏకు వస్తున్న వాహనాలు మాత్రం 250 నుంచి 300 వరకు మాత్రమే ఉన్నాయి. చాలామంది వాహనదారులు తమ పాత వాహనాలను అమ్మిన వెంటనే కొన్న వాళ్ల పేరిట బదిలీ చేయడం లేదు. వాహనం కొనుగోలు చేసిన వ్యక్తులు సైతం సకాలంలో తమ పేరిట బదిలీ చేసుకోవడం లేదు. పైగా ఇలా బదిలీ కాకుండా ఉన్న వాహనాలు ఒకరి నుంచి మరొకరికి అదే పనిగా మారిపోతున్నాయి. చివరకు అసలు వాహన యజమానికి, దానిని వినియోగించే వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు.

ఇలా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో  సుమారు 10లక్షల వాహనాలు బదిలీ కాకుండా ఉన్నట్లు అధికారుల అంచనా. నగరంలో తిరుగుతున్న 1.4లక్షల ఆటో రిక్షాల్లో సగానికి పైగా బినామీ పేర్లు, ఫైనాన్షియర్లపైనే నమోదై ఉన్నాయి. కానీ వాటిని వినియోగించే వ్యక్తులు మాత్రం వేరే ఉన్నారు. అలాగే తమిళనాడు, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన లక్షలాది కార్లు, క్యాబ్‌లు ఎలాంటి డాక్యుమెంట్‌లు లేకుండానే నగరంలో తప్పుడు చిరునామాలపై నమోదై తిరుగుతున్నాయి. చాలా వాహనాలు ఎలాంటి యాజమాన్య బదిలీ లేకుండానే రోడ్డెక్కుతున్నాయి. ఇలాంటి వాహనాలు రోడ్డు ప్రమాదాల్లో పట్టుబడినప్పుడు, ›ట్రాఫిక్‌ ఉల్లంఘనల్లో  దొరికిపోయినప్పుడు అసలు వాహన యజమానులు భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగినా, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినా రవాణాశాఖ రికార్డుల్లో నమోదైన వాహన యజమానులనే పోలీసులు పరిగణనలోకి తీసుకొని కేసులు నమోదు చేస్తారు. అలాంటి వాహనాలు తమ వినియోగంలో లేకపోయినప్పటికీ యాజమాన్య బదిలీ చేయకపోవడం వల్ల రూ.వేలల్లో జరిమానాలు చెల్లించక తప్పదు.  

బినామీ దందా...
మరోవైపు వాహనాలపైన బినామీ దందా సైతం యథేచ్ఛగా సాగుతోంది. దొంగ వాహనాలు, కాలం చెల్లిన వాహనాలు, వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి తరలించిన వాహనాలు, ఒక ఫైనాన్షియర్‌ నుంచి మరో ఫైనాన్షియర్‌కు బదిలీ అయ్యే వాహనాలు చాలా వరకు బినామీ పేర్లపైనే నమోదవుతున్నాయి. నగరంలోని  కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో రవాణా అధికారులు కొందరు దళారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఏజెంట్‌లు, దళారుల  కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. చిరునామా ధ్రువీకరణ కోసం రకరకాల ఆధారాలను సృష్టిస్తున్నారు. ఇదొక వ్యవస్థీకృత వ్యాపారంగా సాగుతోంది.   

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు...
వాహనం అమ్మిన వెంటనే ఆ వివరాలను ఆర్టీఏ వెబ్‌సైట్‌లోని నమోదు చేసి సకాలంలో కొన్న వారి పేరిట నమోదయ్యే విధంగా అధికారులను సంప్రదించాలి. ఈ సేవా కేంద్రాల్లో, ఇంటర్నెట్‌ కేంద్రాల్లో ఆర్టీఏ ఆన్‌లైన్‌ పౌరసేవలను వినియోగించుకోవచ్చు. మోటారు బైక్‌లు, కార్లు తదితర వాహనాల బదిలీ కోసం రూ.650 నుంచి రూ.850 వరకు ఫీజు చెల్లిస్తే చాలు. కానీ చిన్న పనిని వాయిదా వేసినా, జాప్యం చేసినా రూ.వేలల్లో నష్టపోవడమే కాదు. నేరగాళ్ల చేతిలో పడితే మరిన్ని చిక్కులు తప్పవు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement