ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ బాట

RSS Strategy To Expand In Telangana State - Sakshi

రాష్ట్రంలో విస్తరించేందుకు పకడ్బందీ వ్యూహం

2024కల్లా 10 వేల గ్రామాల్లో శాఖల ఏర్పాటే లక్ష్యంగా కసరత్తు

రేపట్నుంచి నగరంలో విజయ సంకల్ప శిబిరం

కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న భాగవత్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతోంది. 2024 నాటికి కనీసం 5 లక్షల సభ్యత్వాలతో రాష్ట్రంలో 10 వేల గ్రామాల్లో శాఖల ఏర్పాటే లక్ష్యంగా కసరత్తు ప్రారంభిం చింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఉనికి కనిపిస్తున్నా మొత్తంగా చూస్తే మాత్రం నామ మాత్రంగానే ఉంది. హిందుత్వ భావ జాలాన్ని గ్రామస్థాయి వరకు తీసు కెళ్లేందుకు తెలంగాణ అను వైన ప్రాంత మే అయినా ఇప్పటిదాకా తాము పెద్దగా పట్టించుకోలేదన్న భావనతో ఇప్పుడు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగుతోంది. 

2025కి ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించి వందేళ్లు అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా తన ఉనికిని ఘనంగా చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌ శివార్లలోని భారత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగ ణంలో విజయ సంకల్ప శిబిరం పేరుతో సమాయత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనికి ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌ హాజరు కానున్నారు. ఈ శిబిరానికి హాజరయ్యే దాదాపు ఏడున్నర వేల మంది కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లోకి....
రాజకీయ పార్టీలతో పోలిస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక భిన్నంగా ఉంటుంది. హిందుత్వ భావజాల విస్తరణే ప్రధాన లక్ష్యం అయినా సామాజిక అంశాలపై స్పందించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం దాని ప్రత్యేకత. ఈ విషయంలో మరింత పదును పెట్టడం ద్వారా తెలంగాణ పల్లెల్లో జెండా ఎగరేయాలనేది ఆర్‌ఎస్‌ఎస్‌ తాజా ఆలోచన. దీనిపై మోహన్‌ భగవత్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఐదు లక్షల సభ్యత్వాల్లో సగం విద్యార్థులవి ఉండేలా చూడనున్నారు. ఇందుకోసం వారిని ఆకట్టుకునే కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించారు. 

సామాజిక అంశాలకు సంబంధించి పర్యావరణంపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించడం, విరివిగా మొక్కల పెంపకం, జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కులాల మధ్య అంతరాల వల్ల హిందుత్వ భావజాలానికి ఇబ్బందిగా మారిందన్న ఉద్దేశంతో ఈ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారించారు. సమ రసత కార్యక్రమం పేరుతో గ్రామాల్లో అన్ని కులాల వారు ఆలయ పూజల్లో పాల్గొనేలా చేయడంతోపాటు ఊరంతటికీ ఒకే శ్మశాన వాటిక ఉండేలా చూడాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచన. 

ఇక గ్రామ వికాస కార్యక్రమాల పేరిట మద్యపానం తగ్గించడం, అక్షరాస్యత పెంపు, మహిళలను గౌరవించడం, వారికి రక్షణగా ఉండటం, వలసల నివారణ, సేంద్రియ వ్యవసాయం, గోవుల వృద్ధిపై ముమ్మర ప్రచారం చేయనుంది. స్వయంగా కొన్ని కార్యక్రమాలను ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించనుంది. కుటుంబాల్లో కలతల నివారణ, వృద్ధుల ఆదరణ, పాశ్చాత్య సంస్కృతిపై ఆకర్షణ తగ్గించే కార్యక్రమాలు కూడా చేపట్టనుంది. సోషల్‌ మీడియా అనర్ధాలపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. తద్వారా ప్రజలకు చేరవయ్యేలా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించనున్నారు.

రెండు దశాబ్దాల తర్వాత...
ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్ల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ స్థానికంగా ముఖ్య శిక్షక్, ఆపై కార్యకర్తలకు శిబిరాలు నిర్వహించింది. 1999లో కర్నూలు, కరీంనగర్‌లలో వాటిని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌ శిబిరాన్ని నిర్వహిస్తోంది. 2017లో కరీంనగర్‌లో సాధారణ శిబిరం, ఘట్‌కేసర్‌ సమీపంలో జాతీయ స్థాయి కార్యనిర్వహక కమిటీ సమావేశాలు జరిగినా రాష్ట్రవ్యాప్త శిబిరం మాత్రం ఇప్పుడే జరగనుంది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు 2,500 శాఖలు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 3,200కు పెరిగింది. వాటిని 12 వేలకు పెంచాలనేది తాజా లక్ష్యం. 

శిబిరంలో భద్రాద్రి నగరం, యాదాద్రి నగరం, సమ్మక్క సారలమ్మ నగరం, జోగులాంబ నగరం, భాగ్యలక్ష్మి నగరం పేరుతో ఐదు విభాగాలు ఏర్పాటు చేశారు. వాటిల్లోనే కార్యకర్తలకు బస ఏర్పాటు చేశారు. 24న ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సమావేశాలు ఉంటాయి. 25న ఉదయం సమావేశం తర్వాత కార్యకర్తలు నాలుగు మార్గాల్లో ఎల్‌బీ నగర్‌కు, అక్కడి నుంచి కవాతు ద్వారా సరూర్‌నగర్‌ మైదానానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మోహన్‌ భగవత్‌ ప్రసంగిస్తారు. మరుసటి రోజు కూడా ఆయన ప్రధాన వేదిక మీదుగా మరోసారి ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు శ్యామ్‌కుమార్, నాగరాజు, దూసి రామకృష్ణ, తిప్పేస్వామి, దక్షిణామూర్తి, కాచం రమేశ్, దేవేందర్‌ తదితరులు హాజరుకానున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top