రాష్ట్రంలో నగదు మార్పిడి రూ.3,500 కోట్లు | rs 3500cr money exchanged in telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నగదు మార్పిడి రూ.3,500 కోట్లు

Nov 17 2016 3:23 AM | Updated on Sep 22 2018 7:50 PM

తెలంగాణలో ఇప్పటివరకు రూ.3,500 కోట్ల విలువైన పెద్ద నోట్ల మార్పిడి జరిగింది. బ్యాంకు ఖాతాల్లో కూడా భారీగా నగదు జమైంది.

♦ ఖాతాల్లోకి వచ్చింది రూ.6,000 కోట్లు
♦ ఎస్‌బీఐ ఖాతాల్లోకి అత్యధికంగా రూ.3,000 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇప్పటివరకు రూ.3,500 కోట్ల విలువైన పెద్ద నోట్ల మార్పిడి జరిగింది. బ్యాంకు ఖాతాల్లో కూడా భారీగా నగదు జమైంది. నగదు మార్పిడికి అదనంగా ఖాతాదారుల అకౌంట్లలో రూ.6,000 కోట్లు జమయ్యాయి. పెద్ద నోట్లు చెల్లవంటూ ప్రధాని మోదీ ప్రకటన చేసిన ఈ నెల 8వ తేదీ రాత్రి నుంచి పాత నోట్లను మార్చుకునేందుకు జనమంతా బ్యాంకుల ఎదుట బారులు తీరడం తెలిసిందే. దాంతో సెలవు దినాలైన శని, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పని చేసి చెల్లని పెద్ద నోట్లను మార్చే సేవలను కొనసాగించాయి. బుధవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.3,500 కోట్ల మేరకు నోట్ల మార్పిడి జరిగినట్లు బ్యాంకర్లు లెక్క తేల్చారు.

వీటికి తోడు బ్యాంకుల్లో ఖాతాలున్న వినియోగదారులంతా తమ పాత నోట్లను జమ చేసుకునేందుకు ఎగబడ్డారు. దాంతో ఖాతాల్లోని నగదు నిల్వలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఒక్క స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోనే ఏకంగా రూ.3,000 కోట్లు ఖాతాల్లో జమయ్యాయి! మిగతా బ్యాంకులన్నింట్లో కలిపి మరో రూ.3,000 కోట్లకుపైగా జమైనట్లు అంచనా వేశారు. వెరసి బ్యాంకు ఖాతాల్లో రూ.6,000 కోట్లకు పైగా జమయిందని లెక్కలేస్తున్నారు. వీటిలో 99 శాతానికి పైగా పెద్ద నోట్లేనని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు రూ.8,900 కోట్లకుపైగా విలువైన రూ.1,000, రూ.500 నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు ఆర్‌బీఐ అంచనా వేసుకుంటోంది. తెలంగాణవ్యాప్తంగా 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 20 ప్రైవేటు బ్యాంకులకు సంబంధించి మొత్తం 4,758 బ్రాంచీలున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని పోస్టాఫీసుల్లోనూ నగదు మార్పిడికి కేంద్రం అవకాశం కల్పించింది. పోస్టాఫీసుల ద్వారా రోజుకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్య నగదు మార్పిడి జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement