ట్రాక్టర్‌ కిందపడి యువకుడి మృతి | Road Accident In Nalgonda | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ కిందపడి యువకుడి మృతి

Apr 8 2018 8:47 AM | Updated on Aug 30 2018 4:20 PM

Road Accident In Nalgonda - Sakshi

పాశికంటి రాకేష్‌ మృతదేహం

దుగ్గొండి(నర్సంపేట) : ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన వరంగల్‌రూరల్‌ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పాశికంటి మహేందర్, రమ దంపతుల కుమారుడు పాశికంటి రాకేష్‌ (22) అనస్తిషియా డిప్లొమా పూర్తి చేశాడు. అనంతరం గత సంవత్సర కాలంగా హన్మకొండలోని మాక్స్‌కేర్‌ ఆస్పత్రిలో అనస్తిషియా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా తిమ్మంపేట గ్రామం వట్టెంచెరువు కట్ట క్రాస్‌ తిరుగుతుండగా మహ్మదాపురం నుంచి తిమ్మంపేట వైపుకు ట్రాక్టర్‌ ఎదురుగా వస్తుండటంతో సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. ఇదే క్రమంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్‌ రాకేష్‌ పైనుంచి వెళ్లింది. దీంతో రాజేష్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పది రోజుల క్రితమే కూతురు..
పాశికంటి మహేందర్, రమ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ఇటీవల 10 రోజుల క్రితం గర్భవతిగా ఉన్న కూతురు అనూషకు అధిక రక్తస్రావం కావడంతో చికిత్స చేయించినా ఫలితం లేక మృతి చెందింది. దశదిన కర్మ పూర్తి అయిన వెంటనే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ దంపతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్న పేగులను పొగొట్టుకున్న వారి రోదనలు కంటతడి పెట్టించాయి. మహ్మదాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement