
సాక్షి, హైదరాబాద్: 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 21న ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈనెల 19న ఆర్టీసీ కార్మికుల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మంగళవారం గాంధీభవన్‌లో రేవంత్, మాజీ మంత్రులు దామోదర రాజనరసింహ, షబ్బీర్‌అలీ విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బంద్‌లో కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పాల్గొంటాయన్నారు. కార్మికులను తొలగిస్తున్నామని, కొత్త వారిని నియమిస్తామని సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, సెల్ఫ్ డిస్మిస్ అనేది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దామోదర మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేంద్రం స్పందించాలని కోరారు. గవర్నర్ తమిళిసై కేంద్ర పెద్దలతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ, సీఎం సెల్ఫ్ డిస్మిస్ అని, మంత్రులు ఉద్యోగాల్లో చేరాలని చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే డబుల్ గేమ్ అని అనుమానంగా ఉందన్నారు.