‘మల్లన్న’ నుంచే సింగూరుకు!

Retired engineers association report submitted to KCR - Sakshi

కొండపోచమ్మ సాగర్‌ నుంచి తరలింపుకన్నా అదే ఉత్తమం

సీఎంకు రిటైర్డ్‌ ఇంజనీర్ల నివేదిక

కొండపోచమ్మ సాగర్‌ ద్వారా అయితే విద్యుత్‌ ఖర్చు రూ. 352 కోట్లు

అదే మల్లన్న సాగర్‌ అయితే రూ. 67 కోట్లని వివరణ  

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సింగూరుకు ఎత్తిపోసే విషయంలో మళ్లీ సందిగ్ధత ఎదురవుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా నీటిని తరలించాలన్న ప్రతిపాదనను మార్చి కొండపోచమ్మ సాగర్‌ నుంచి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేయగా మళ్లీ ఇప్పుడు మల్లన్నసాగర్‌ నుంచి తరలించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మల్లన్నసాగర్‌ నుంచి సింగూరుకు నీటిని తరలించేందుకు టన్నెల్‌ పనుల్లో జాప్యం, లిఫ్ట్‌ అవసరాలు ఉండటంతో దాన్ని పక్కనపెట్టి కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి గ్రావిటీ ద్వారా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించగా ప్రస్తుతం ఆ ప్రతిపాదన వద్దని మల్లన్నసాగర్‌ నుంచే నీటిని తరలించడం ఉత్తమమని రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక సమర్పించింది.

మళ్లీ మొదటికి...
గతంలోనే కాళేశ్వరం స్థిరీకరణ కింద నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వాలంటే సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులను సైతం కాళేశ్వరం నీటితో నింపేలా ప్రణాళిక వేశారు. మల్లన్నసాగర్‌కు వచ్చే నీటిని గ్రావిటీ పద్ధతిన సింగూరుకు తరలించి అటు నుంచి శ్రీరాంసాగర్‌ వరకు తరలించేలా ప్రణాళిక రచించారు. మల్లన్నసాగర్‌లో నీటిని తీసుకునే లెవల్‌ 557 మీటర్లు ఉండగా సింగూరు లెవల్‌ 530 మీటర్లుగా ఉంది. అయితే పూర్తిగా గ్రావిటీ పద్ధతిన నీటిని తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో మధ్యన 30 మీటర్ల లిఫ్టును ఏర్పాటు చేసి నీటిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపాలనేది ఉద్దేశం. అయితే మధ్యలోని ప్యాకేజీ–17లోని 18 కి.మీల టన్నెల్‌ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం, ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

627 మీటర్ల కొండపోచమ్మ లెవల్‌ నుంచి 530 మీటర్ల లెవల్‌ ఉన్న సింగూరుకు పూర్తి గ్రావిటీ ద్వారా నీటిని తరలించవచ్చని నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసింది. ఈ విధానం ద్వారా మరింత ఆయకట్టుకు నీరందించవచ్చని చెబుతూ దీనికి అనుగుణంగా కొండపోచమ్మ సాగర్‌ కింద కాల్వల నిర్మాణానికి, సంగారెడ్డి కాలువ వ్యవస్థ రూ. 1,330 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.ఈ కాల్వలను విస్తరించి సింగూరుకు నీటిని తరలించాలని నిర్ణయించారు. అయితే ఇటీవల గోదావరి పరీవాహకంలో పర్యటించిన రిటైర్డ్‌ ఇంజనీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో కూడిన బృందం... కాళేశ్వరం జలాలను సింగూరుకు తరలించే అంశాలపై అధ్యయనం చేసింది. ఇందులో కొండపోచమ్మ సాగర్‌ నుంచి నీటి తరలింపుకన్నా మల్లన్నసాగర్‌ నుంచి నీటి తరలింపే ఉత్తమమని తేల్చింది.

తాజా ప్రతిపాదనకు కారణాలివే...
సింగూరుకు నీటిని తరలించే 96వ కి.మీ. నుంచి 150.59 కి.మీ వరకు ఉన్న అలైన్‌మెంట్‌ సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్, ఇస్నాపూర్‌ పారిశ్రామిక ప్రాంతం, గీతం యూనివర్సిటీ, కాశీపూర్, కంది గ్రామాల పరిధిలో ఉన్న పరిశ్రమలు, మల్కా పూర్‌లోని పెద్ద చెరువు మీదుగా వెళ్లాల్సి ఉందని, ఎన్‌హెచ్‌–65ని కూడా దాటాల్సి ఉంటుందని నివేదికలో రిటైర్డ్‌ ఇంజనీర్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ. కోటికిపైగా ఉందని, దీన్ని చదరపు గజాల కింద విభజించి పరిహారిన్ని లెక్కిస్తే భూసేకరణకే భారీగా నిధులు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ భూముల నుంచి కాల్వలను తవ్వే ప్రక్రియపై ఏవైనా కోర్టు కేసులు నమోదైనా, లిటిగేషన్‌లో ఉన్న వీటి పరిష్కారానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది.దీనికితోడు కొండపోచమ్మ సాగర్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం నిర్మిస్తున్న కేశవపూర్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించాల్సి ఉంది.

అదే జరిగితే సింగూరు జలాలపైనే ఆధారపడిన నిజాం సాగర్‌కు నీటి తరలింపు ఇబ్బందిగా ఉంటుంది. దీని బదులు మల్లన్నసాగర్‌ ద్వారా 3 వేల క్యూసెక్కుల నీటిని హల్దీ వాగు ద్వారా సింగూరుకు, అటునుంచి నిజాంసాగర్‌కు తరలించడమే ఉత్తమం. ఇక మల్లన్నసాగర్‌ నుంచి సింగూరుకు నీటిని తరలిస్తే విద్యుత్‌ ఖర్చు కేవలం రూ. 67 కోట్లు మాత్రమే అవుతుండగా అదే కొండపోచమ్మ ద్వారా అయితే రూ. 352 కోట్లు అవనుంది.ఇప్పటికే మల్లన్నసాగర్‌ నుంచి సింగూరుకు నీటిని తరలించేందుకు గతంలోనూ ప్యాకేజీ–17, ప్యాకేజీ–18లో పనులు, భూసేకరణ అవసరాలకు రూ. 600 కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుతం అలైన్‌మెంట్‌ మారిస్తే ఈ ఖర్చంతా వృధా అయ్యే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా ఆర్థిక, నిర్మాణ, నిర్వహణపరంగా మల్లన్నసాగర్‌ నుంచి సింగూరుకు నీటిని తరలించడం ఉత్తమమని రిటైర్డ్‌ ఇంజనీర్లు తేల్చిచెప్పారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top