జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించాలి

Remove the GST on the handloom industry - Sakshi

తెలుగు రాష్ట్రాల మాజీ ప్రజా ప్రతినిధుల డిమాండ్‌  

లోక్‌సభ ఎన్నికల్లోపు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌: చేనేత పరిశ్రమను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మాజీ ప్రజా ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జాతీయ చేనేత బోర్డు సభ్యుడు కేఎన్‌ మూర్తి ఆ«ధ్వర్యంలో చేనేత రంగంపై జీఎస్టీ ప్రభావం అనే అంశంపై శనివారం ఇక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు, చేతి వృత్తి కార్మికులు పన్ను భారంతో ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎంపీ గుండు సుధారాణి పేర్కొన్నారు. చేనేత రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కేటీఆర్‌ను కలిసి పన్ను మినహాయింపుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరతామని పేర్కొన్నారు.

చేనేత వస్త్రాలపై జీఎస్టీ అమలు ఎత్తివేయాలంటూ చేనేత నాయకులు, కార్మికులు అనేక పోరాటాలు చేస్తున్నారని, తాను కూడా పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశానని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌ తెలిపారు. దీనిపై తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల ఎంపీలందరూ ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేఎన్‌ మూర్తి మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేనేత రంగంపై జీఎస్టీ మినహాయింపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చేనేతపై పన్ను మినహాయింపు పోరాటంలో భాగంగా, ఈ నెల 3న తెలుగు రాష్ట్రాల ఎంపీలతో కలిసి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని, ప్రధాని మోదీని, జీఎస్టీ సబ్‌ కమిటీని కలవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఒకవేళ కేంద్రం నుంచి సరైన సమాధానం రాకుంటే తెలుగు రాష్ట్రాల కలెక్టరేట్‌లలో వినతి పత్రాలివ్వడం ఆయా జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. జీఎస్టీ మినహాయింపు కోసం దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజాప్రతినిధులతో కలిసి కామన్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  చేనేత రంగంపై పన్ను మినహాయింపుపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనము వెనుకబడి ఉన్నామని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. తాను ఈ సమస్యపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ    రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోశిక యాదగిరి, పద్మశాలి యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top