మెస్‌ చార్జీలు విడుదల చేయండి

Release the mess charges - R Krishnaiah - Sakshi

బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విద్యార్థుల భోజన ఖర్చులకు గత 7 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ మంజూరు చేయడం లేదని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. మెస్‌ బిల్లులు చెల్లించకపోతే విద్యార్థులకు భోజనాలు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. హాస్టల్‌ మెస్‌ చార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశా రు. బుధవారం సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంలను కలిసి ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హాస్టల్‌ వార్డెన్లు వడ్డీలకు అప్పులు తెచ్చి హాస్టళ్లు నడిపిస్తున్నారని తెలిపారు. రూ. లక్షల్లో అప్పులు పెరగడం వల్ల హాస్టళ్లు నడపడం కష్టంగా మారిందని వాపోయారు. బిల్లులు చెల్లించని కారణంగా హాస్టళ్లను మూసివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే హాస్టళ్లకు బడ్జెట్‌ విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. హాస్టళ్లలో 1,178 వార్డెన్‌ పోస్టులు, 1,600 వర్కర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వీటిని తక్షణమే భర్తీ చేయాలని కోరారు. హాస్టళ్ల సమస్యలపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించాలని, తక్షణమే బకాయిలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

వంద కాలేజీలు ప్రారంభించాలి..
వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు బుధవారం బీసీ భవన్‌కు వచ్చి తమకు హాస్టళ్లలో టిఫిన్స్‌ పెట్టడం లేదని, భోజనంలో నాణ్యత ఉండటం లేదని ఆర్‌.కృష్ణయ్యకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే బడ్జెట్‌ విడుదల చేయిస్తానని ఆర్‌.కృష్ణయ్య వారికి హామీ ఇచ్చారు. బీసీలకు 100 డిగ్రీ రెసిడెన్షియల్‌ కాలేజీలు ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, జైపాల్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top