122.5 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాతో రికార్డు

Recorded with 122 million above tonnes of cargo - Sakshi

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా

రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యం కంటే 10% అధికం

సాక్షి, హైదరాబాద్‌: 2018–19 ఆర్థిక సంవత్సరంలో 122.51 మిలియన్‌ టన్నుల సరుకులు రవాణా చేసి చరిత్ర సృష్టించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా అన్నారు. వార్షిక సరుకు రవాణాలో 19.47 మిలియన్‌ టన్నుల అధికవృద్ధిని సాధించి ఇతరజోన్ల కంటే దక్షిణ మధ్య రైల్వే జోన్‌ రికార్డు నమోదు చేసిందని తెలిపారు. రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యం (111 మిలియన్‌ టన్నులు) కంటే 10 శాతం అధికంగా సరుకు రవాణా చేశామన్నారు. ఇందుకు కృషి చేసిన ఉద్యోగులు, సిబ్బందిని గజానన్‌ మాల్యా ప్రశంసించారు. సరుకు రవాణాలో ఈ రికార్డు సాధించడానికి పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో రోజువారీగా విశ్లేషించి అనుకూలమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌ గేట్లను తొలగించడం, పట్టాల పునరుద్ధరణ వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులతో లక్ష్యాన్ని సాధించామన్నారు. 

బొగ్గు, సిమెంట్‌ రవాణాతోనే.. 
గణనీయంగా బొగ్గు, సిమెంట్‌ సరుకు రవాణా ద్వారానే దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు సాధ్యమైందని గజానన్‌ మాల్యా పేర్కొన్నారు. బొగ్గు 67.56 మిలియన్‌ టన్నులు, సిమెంట్‌ 28.23 మిలియన్‌ టన్నులు, ఇనుప ఖనిజం 5.46 మిలియన్‌ టన్నుల మేర సరుకులు రవాణా అయ్యాయని వెల్లడించారు. తెలంగాణలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్, ఏపీలోని దక్షిణ కోస్తాకి చెందిన కృష్ణపట్నం పోర్ట్‌ కంపెనీ లిమిటెడ్, కాకినాడ పోర్ట్‌ సంస్థల సరుకును అధికంగా రవాణా చేసినట్లు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top