చెక్కులు రెడీ

Ready Foe Checks Distribution Raithu bandhu Scheme - Sakshi

20 నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ

మొదటి విడతలో 65,153 మంది రైతులకు రూ. 48 కోట్లు

పక్కాగా పంపిణీకి అధికారుల ఏర్పాట్లు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

తీరనున్న పెట్టుబడి తిప్పలు

మెదక్‌జోన్‌:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు చెక్కుల పంపిణీకి సమయం ఆసన్నమైంది. నాలుగు విడతల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ నెల 20 నుంచి మొదటి విడత పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానుంది. జిల్లాలో 80 వేల ఎకరాలకు సంబంధించి 65,153 మంది రైతులు మొదటి విడతలో చెక్కులు అందుకోనున్నారు. అవకతవకలు జరగకుండా రైతు సమన్వయ సమితి సభ్యులు అధికారులు, రైతులకు నడుమ అనుసంధానకర్తలుగా వ్యవహరించనున్నారు.

మొదటి విడతలో రూ. 48 కోట్లు..
జిల్లాలో 20 మండలాలు ఉండగా, 381 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 3.20 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి, 2.20 లక్షలమంది రైతులు ఉన్నారు. మొదటి విడతలో 130 రెవెన్యూ గ్రామాలకు చెందిన 80 వేల ఎకరాలకు సంబంధించి 65,153 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో సుమారు రూ.48 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా స్థాయి అధికారి ఒకరు తెలిపారు. చెక్కుల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పక్కాగా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో రైతు సమితులు అధికారులకు, రైతులకు అనుసంధానంగా వ్యవహరించనున్నారు. అర్హులైన ప్రతీ రైతుకు ఎకరాకు రూ. 4 వేలు అందిస్తామనిఅధికారులు చెబుతున్నారు.

తప్పనున్న పెట్టుబడి తిప్పలు..
ఇన్నాళ్లు సాగు ప్రారంభం అయ్యే సమయంలో పెట్టుబడికి చేతిలో పైసలు లేక రైతులు నానా అవస్థలు పడేవారు. అప్పుల కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో సాగు ఆలస్యమయ్యేది. ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తుండడంతో రైతులకు పెట్టుబడి తిప్పలు తీరనున్నాయి.

సంతోషంగా ఉంది..
పంట పెట్టుబడికి ప్రభుత్వం ఎకరాకు రూ. 4 వేలు ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇప్పటి దాక సాగు ప్రారంభంలో అప్పులు దొరకక అనేక అవస్థలు పడేది. పైసలు సకాలంలో దొరకక మందులు ఆలస్యంగా సల్లటంతో మంచి దిగుబడి రాకపోయేది. ఇక నుంచి ఆ బాధలు ఇక ఉండవు. ముందుగా పైసలు వస్తుండడంతో అదనులో సాగు ప్రారంభిస్తాం. మందులు ముందే తెచ్చుకుంటాం.    –నర్సింలు, రైతు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top