శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి

Rapid Develpment Taking Place In Warangal - Sakshi

రెండోసారి మున్సిపల్‌ ఎన్నికలకు 

సిద్ధమవుతున్న ‘బొగ్గు గని’

దశాబ్ద కాలంలో అన్ని రంగాల్లో ముందుకు..

కుగ్రామం నుంచి గ్రేడ్‌ – 3 మున్సిపాలిటీగా రూపాంతరం

సింగరేణి గనులు, కేటీపీపీ వెలుగులతో పారిశ్రామిక గుర్తింపు

పూర్తిగా వలసలతో ఏర్పడిన పట్టణం

సాక్షి, భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణం పూర్తిగా వలసలపై ఆధారపడి మున్సిపాలిటీగా మారింది. పట్టణానికి బతుకుదెరువు కోసం వచ్చి చాలా మంది ఇక్కడే స్థిరపడ్డారు. దీనికి తోడు సింగరేణి కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడంతో ఈ దశాబ్దం మొదటి నుంచి పట్టణానికి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య పెరిగింది.   భూపాలపల్లిని ఆనుకుని 30 నుంచి 50 కిలోమీటర్లు దూరంలో ఏ పట్టణం లేకపోవడం కూడా భూపాలపల్లి పట్టణంగా మారే అనివార్యత ఏర్పడింది. పూర్తిగా అటవీ మండలాలకు దగ్గరగా ఉండడం, హన్మకొండ, పరకాల 40 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో భూపాలపల్లికి పట్టణంగా రూపాంతరం చెందింది.

వలసల విషయానికి వస్తే చుట్టుపక్కల మండలాలైన కాటారం, గణపురం, చిట్యాల, రేగొండ నుంచి వ్యాపార నిమిత్తం బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. వీటితో పాటు భూపాలపల్లిలో మూడు జిల్లాలకు చెందిన బిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పూర్వపు కరీంనగర్, వరంగల్, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన చాలా మంది ఇక్కడే నివాసం ఏర్పర్చుకున్నారు.  జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం పుంజుకుంది.

గ్రామం నుంచి..
ఒక గ్రామం పట్టణంగా ఎదగాలంటే దాదాపు మూడు నాలుగు దశాబ్ధాలు పడుతుంది. కానీ భూపాలపల్లి పట్టణం అనతి కాలంలోనే మున్సిపాలిటీగా అవతరించింది. తొలుత చిట్యాల తాలూకాలోని కమలాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో శివారు పల్లెగా ఉండేది. 1981లో భూపాలపల్లి 500కు పైగా జనాభాతో గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. 2012 జనవరి 25న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం భూపాలపల్లి పట్టణాన్ని నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2016లో జిల్లాగా ఏర్పడిన భూపాలపల్లి,  2017 ఆగస్టులో కాశీంపల్లి, జంగేడు, వేశాలపల్లి, పుల్లురామయ్యపల్లి శివారు గ్రామాల విలీనంతో గ్రేడ్‌ – 3 మున్సిపాలిటీగా మారింది.   గతంలో భూపాలపల్లి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(బుడా) ప్రతిపాదించినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇది అమలులోకి వస్తే పట్టణ విస్తీర్ణం పెరగడంతో పాటు మరింత అభివృద్ధి చెందనుంది.  

పారిశ్రామికంగా అభివృద్ధి
రాష్ట్రంలోనే పారిశ్రామిక ప్రాంతంగా భూపాలపల్లి గుర్తింపు పొందింది. సింగరేణి గనులు ఓవైపు, కేటీపీపీ వెలుగులు మరోవైపు ఇలా భూపాలపల్లి పట్టణం నానాటికీ విస్తరిస్తోంది. 1987లో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ భూపాలపల్లిలో తొలి బొగ్గుగనిని ప్రారంభించడంతో అప్పటి నుంచి పట్టణం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందింది.

ఇదే క్రమంలో మంచిర్యాల జిల్లాలోని కొన్ని బొగ్గు గనులు మూతపడటం.. భూపాలపల్లిలో నూతన గనులు ప్రారంభించడంతో కార్మికుల కుటుంబాలు ఇక్కడికి రావడంతో జనాభా పెరిగింది. మరో వందేళ్లకు సరిపోయే బొగ్గు నిల్వలు ఉండటంతో పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే చెప్పాలి. సింగరేణి గనులకు తోడుగా కేటీపీపీ మొదటి దశ 2006లో, రెండోదశ 2009లో ప్రారంభం కావడంతో పట్టణ అభివృద్ధి పెరిగింది. 

రెండో సారి మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం
జనవరిలో జరుగబోయే మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గతంలో 2012లో పట్టణం నగరపంచాయతీగా ఏర్పడిన తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జనవరిలో రెండోసారి మున్సిపల్‌ ఎన్నికలు జరుగబోతున్నాయి. గతంలో 20 వార్డులుగా ఉన్న మున్సిపాలిటీ ప్రస్తుతం 30 వార్డులకు చేరుకుంది. ఓటర్ల సంఖ్య 50,651 మంది ఉన్నారు.

పట్టణ జనాభా 2011 లెక్కల ప్రకారం పురుషులు 21,810, మహిళలు 20,577 కలిపి మొత్తంగా 42,387 మంది ఉన్నారు. అయితే, ప్రస్తుతం జనాభా 82 వేల వరకు ఉండొచ్చని అంచనా.ప్రస్తుతం భూపాలపల్లి మునిసిపాలిటీ ఓటర్లు 50,651 కాగా.. ఇందులో పురుషులు 26,399 మంది, మహిళలు 24,251 మంది ఉన్నారు. అలాగే, ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యారు.

ఐదేళ్ల పాలన మరువలేనిది..
భూపాలపల్లి మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌గా నేను ఎన్నికవుతానని ఏ రోజు అనుకోలేదు. పదవీ బాధ్యతలు చేపట్టిన మొదట్లో కొంత ఆందోళన, భయానికి గురయ్యాను. కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుంటే చాలా సంతోషంగా ఉండేది. వంద పడకల ఆస్పత్రి పనులు, జయశంకర్‌ పార్కు ప్రారంభం చేస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మునుపెన్నడూ లేని విధంగా పట్టణంలో సీసీ రోడ్లు, సైడ్‌ కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయించాను. మౌలిక సౌకర్యాలకు పెద్దపీట వేసి అధిక నిధులు కేటాయించాం. కౌన్సిలర్ల సహకారంతో భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను. 
– బండారి సంపూర్ణ రవి, మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్‌

మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్‌ ఎన్నికల విజయవంతానికి కృషి
భూపాలపల్లి మునిసిపాలిటీలో రెండోసారి జరుగుతున్న ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వార్డుల విభజన నుంచి మొదలు ఎన్నికల నిర్వహణ వరకు ఎలాంటి తప్పిదాలకు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలి. 
– ఎస్‌ సమ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top