అదే నిర్లక్ష్యం.!

Rain Water in Petrol Bunk Tank Hyderabad - Sakshi

మారని పెట్రోల్‌ బంకుల తీరు

ఇంధన నిల్వలపై ఇథనాల్‌ ప్రభావం

ట్యాంక్‌లలో వర్షపు నీరు

శాంపిల్స్‌ సేకరణకే అధికారులు పరిమితం  

మూడు రోజుల క్రితం హయత్‌నగర్‌ లోని  హయత్‌ ఫిల్లింగ్‌  స్టేషన్‌ హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ లో నీళ్లు కలిసిన డీజిల్‌  పోయడంతో దాదాపుఇరవై వాహనాలు ముందుకు వెళ్లకుండా మొరాయించడంతో వాహనదారులు బంకు వద్ద ఆందోళనకు దిగారు. సరిగ్గా నెల రోజుల క్రితం కూడా ఇదే బంకు వద్ద నీళ్లతో కూడిన  పెట్రోలు వచ్చిందని వాహనదారులు ఆందోళనకు చేపట్టడంతో పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించి చేతులు దులుపుకున్నారు.

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో పెట్రోల్‌ బంకుల తీరు మారడం లేదన్నదనేందుకు ఇదీ నిదర్శనం. కాసుల ధ్యాస తప్ప నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌ వాహనదారులకు అందించాలన్న ప్రయత్నం మాత్రం కానరావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్‌ బంకుల నిర్వహణలో నిర్లక్ష్యం, చేతివాటం వాహనదారులను నిలువు దోపిడీకి గురిచేస్తోంది.  ఆయిల్‌ కంపెనీల నుంచి ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌ సరఫరా  నిల్వలను దెబ్బతీస్తోంది. ఇథనాల్‌ మిలితమైన పెట్రోల్‌ నిల్వల్లో పొరపాటున కూడా నీళ్లు కలిస్తే క్రమంగా పెట్రోల్‌ నీరు మారుతోంది. చమురు సంస్థలు అధికారికంగానే ఇథనాల్‌ బ్లెండింగ్‌ ప్రోగ్రాం కింద పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నట్లు కంపెనీల ఇన్వాయిస్‌లు స్పష్టం చేస్తున్నాయి. ఇథనాల్‌ను ఇంధనంతో కలపడం వల్ల పెట్రోల్‌లోని ఆక్టేన్‌ సంఖ్య పెరుగుతుంది. దీంతో ధర కూడా  తగ్గించాల్సి ఉంటుంది. అయితే చమురుసంస్ధలు వీటిని పట్టించుకోకుండా పెట్రోల్‌లో  సుమారు పదిశాతం ఇథనాల్‌ కలిపి సరఫరా చేయడం విస్మయానికి గురిచేస్తోంది. వర్షకాలం నేపథ్యంలో ట్యాంకుల్లో  కొద్ది పాటి నీరు చేరినప్పటికీ నిల్వలు క్రమంగా నీళ్లుగా మారుతున్నాయి. బంకుల నిర్వాహకులు అడుగు నిల్వల సైతం పంపింగ్‌ చేస్తుండటంతో వాహనాలు మెకానిక్‌ షెడ్లకు చేరుతున్నాయి.దీంతో వాహనదారుల ఆందోళనకు దిగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం మొక్కుబడిగా కేసులు నమోదు చేసి మ..మ అనిపిస్తున్నారు.

మెకానిక్‌ షెడ్డుకే....
మహానగరంలో నిత్యం వాహనాలు  మెకానిక్‌ షెడ్లవైపు  పరుగులు తీస్తున్నాయి. నీళ్లతో కూడిన పెట్రోల్, డీజిల్‌ వినియోగంతో వాహానాలు కుప్పగా మారుతున్నాయి.  స్టార్ట్‌ కాకపోవడం, మధ్యలో ఆగిపోవడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా  ఇంజిన్‌పై ప్రభావం పడుతోంది.  వాహనంలోని  బోరు పిస్టన్‌ పనికిరాకుండా పోయి త్వరగా మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. నాలుగుచక్రాల వాహానాలకు మరింత ట్రబుల్స్‌ తప్పడం లేదు. 

శాంపిల్స్‌కే పరిమితం
పౌరసరఫరాల అధికారులు  పెట్రోల్‌ బంక్‌లలో శాంపిల్స్‌ సేకరించేందుకు పరిమితమవుతున్నారనే ఆరోపనలు వ్యక్తమవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ పెట్రోల్‌పై ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి  ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. అధికారులు వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు అందుబాటులో ఉండాలి. అయితే అవీ అందుబాటులో ఉన్నా ఉపయోగించిన దాఖలాలు లేవు. పౌరసరఫరాల శాఖ  తనిఖీలు నిర్వహించి రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌ పరీక్షకు  పంపించిన  శాంపిల్స్‌ వేళ్లపై లెక్కపెట్టవచ్చు.  

నీళ్ల ఇంధనంపై విచారణ
నీటితో కూడిన పెట్రోల్, డీజిల్‌ పంపింగ్‌పై  విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.  వర్షపు నీళ్లు ట్యాంకులో చేరి అడుగున నిల్వ ఉంటుంది. దానిని గుర్తించకుండా  వాహనాల్లో పంపింగ్‌ చేయడం తగదు. ఇథనాల్‌ కారణంగా పెట్రోల్‌ నీటిగా మారుతుందని డీలర్లు పేర్కొంటున్నారు. శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నాం. రాథోడ్, డీఎస్‌వో, రంగారెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top