లేడీ డిజైనర్‌.. రైఫిల్‌ షూటర్.. | Raifil Shooter Harika Rao Special Interview | Sakshi
Sakshi News home page

లేడీ డిజైనర్‌.. రైఫిల్‌ షూటర్..

Sep 10 2018 7:52 AM | Updated on Sep 21 2018 10:18 AM

Raifil Shooter Harika Rao Special Interview - Sakshi

హారికారావు

చదివిన కోర్సు ఒకటి.. చేసిన ఉద్యోగం ఇంకోటి..ఆ రెండింటిలోనూ ‘కిక్‌’ లేక తనను తానే ‘డిజైన్‌’ చేసుకుంది. ఫ్యాషన్‌ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ‘స్టార్‌ డిజైనర్‌’గా పేరు తెచ్చుకుంటోంది ‘హారికారావు’. ఎంతోమంది సెలబ్రిటీలకు దుస్తులు రూపొందించి ఇచ్చే ఈమె తుపాకీ పేల్చడంలోనూ దిట్టేనండోయ్‌. తూర్పు–పడమర లాంటి రెండు విభిన్న రంగాల్లోదూసుకుపోతున్న హారిక.. తన ప్రయాణ విశేషాలను‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

శ్రీనగర్‌కాలనీ : ‘‘నేను పుట్టింది, పెరిగింది అంతా వరంగల్‌లోనే. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ చేశాను. చిన్ననప్పటి నుంచి అందరికంటే భిన్నంగా ఉండడం నాకు అలవాటు. మొదట నా దుస్తులు అందరికి నచ్చేలా కొత్తగా ఉండాలనుకునేదాన్ని. అలా ఫ్యాషన్‌పై ఇష్టం పెరిగింది. కొంత ఊహ వచ్చాక నా దుస్తులు నేనే డిజైనింగ్‌ చేసుకునేదాన్ని. అవి నచ్చి సన్నిహితులు, బంధువులు అలాంటివి చేసి ఇవ్వమనేవారు. అలా శుభకార్యాలకు దుస్తులు డిజైన్‌ చేసేదాన్ని. కొత్త రంగుల మేళవింపుతో డిజైనింగ్స్‌ ఇచ్చేదాన్ని. నా సృజనాత్మకత నచ్చి చాలా మంది ప్రశంశించేవారు. అయితే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేద్దామని కోరిక ఉన్నా వరంగల్‌లో శిక్షణా కేంద్రాలు లేకపోవడంతో ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ చేశాను.  

పతకాలే లక్ష్యం...
కాలేజీ రోజుల్లో ఎన్‌సీసీలో చేరాను. అక్కడే రైఫిల్‌ షూటింగ్‌ నేర్చుకున్నా. ఆ శిక్షణతో ప్రతిష్టాత్మక జీవీ మౌలాంకర్‌ షూటింగ్‌ పోటీల్లో పాల్గొన్నాను. డిజైనింగ్‌తో పాటు షూటింగ్‌లో ఉన్న అభిరుచితో ఫిలింనగర్‌లోని గగన్‌ నారంగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పటికే లెవెల్‌–1 పూర్తి చేశాను. అందరూ మెచ్చేలా రైఫిల్‌ షూటింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని పతకాలు సాధించడమే
ధ్యేయంగా కృషి చేస్తున్నా.   

కుటుంబమే నా బలం
నేను ఎంచుకున్న రెండు రంగాలు విభిన్నమైనవి. ఒకదానిదో మరొక దానికి పొంతన ఉండదు. నా ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యులతో పాటు నా భర్త సత్య ప్రోత్సాహం ఎంతో ఉంది. ఉద్యోగం చేస్తుంగా వివాహమైంది. నా ఇష్టాన్ని గుర్తించిన నా భర్త ప్రోత్సాహంతో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశా. ఇప్పుడు మెహిదీపట్నంలో హారిక స్టూడియోస్‌ను ఏర్పాటు చేశాను. విదేశాల్లో జరిగిన పలు ప్యాషన్‌ వీక్స్‌లో నా డిజైన్స్‌ను ప్రదర్శించాను. అక్కడ మంచి గుర్తింపు వచ్చింది.సినీతారలు ఆనంది, సింగర్‌ చిన్మయి, విష్ణుప్రియ, ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ, పలువురు బుల్లితెర నటీమణులకు డిజైనింగ్‌ చేశాను. అంతర్జాతీయ డిజైనర్‌గా గుర్తింపు కోసం కృషి చేస్తున్నా’’ అంటూ ముగించారు హారిక.  

ఉద్యోగాన్నివదిలేశా..
ఎమ్మెస్సీ తర్వాత ఫార్మారంగంలో ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చాను. కానీ అక్కడ ఆశించిన ఉద్యోగం రాకపోవడంతో సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకొని ఇన్ఫోసిస్‌లో చేరాను. ఉద్యోగంలో ఉండగా తోటి కొలీగ్స్‌ దుస్తులు డిజైన్‌ చేసేదాన్ని. అవి అందరికీ బాగా నచ్చేవి. కొన్నాళ్లకు చేస్తున్న ఉద్యోగంలో కిక్‌ లేకపోవడంతో అది వదిలేసి నచ్చిన ఫ్యాషన్‌ రంగంలోకి అడుగు పెట్టాను. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement