నేరడిగొండకు రాహుల్‌ రాక

Rahul Gandhi Meeting In Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదిలాబాద్‌ జిల్లా పర్యటన ఖరారైంది. బోథ్‌ నియోజకవర్గంలోని నేరడిగొండలో ఈనెల 20న బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సభా ప్రాంగణాన్ని ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాసన్‌ కృష్ణన్, బొస్రాజ్, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు శుక్రవారం పరిశీలించి ఖరారు చేశారు. ఇచ్చోడలోని ఎడ్ల అంగడి, టింబర్‌ డిపో ప్రాంతాలను కూడా పరిశీలించినప్పటికీ, చివరికి నేరడిగొండలోనే పీఏసీఎస్‌ కార్యాలయం వెనుక గల స్థలాన్ని సభ కోసం ఖరారు చేశారు.

శుక్రవారం మధ్యాహ్నం నుంచే బోథ్‌ నియోజకవర్గంలోని నేరడిగొండ, ఇచ్చోడ మండల కేంద్రాల్లో రాహుల్‌గాంధీ పాల్గొనే సభకు అనువైన స్థలాలను తొలుత అన్వేషించారు. చివరకు నేరడిగొండ పీఏసీఎస్‌ కార్యాలయ వెనక గల స్థలం బహిరంగ సభకు అనువుగా ఉంటుందని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. జిన్నింగ్‌ మిల్లు వద్ద గల స్థలం హెలిప్యాడ్‌ నిర్మాణానికి అనువుగా ఉంటుందని తేల్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్, బోథ్‌ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు, జిల్లా నాయకులు గండ్రత్‌ సుజాత, జాదవ్‌ నరేష్, కుమ్రం కోటేశ్వర్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌ జిల్లాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హాజరయ్యారు.

భారీ జన సమీకరణకు నిర్ణయం
ఉత్తర తెలంగాణలో రాహుల్‌గాంధీతో ఏర్పాటు చేస్తున్న తొలి ఎన్నికల ప్రచారసభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ జరపడం ద్వారా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ సత్తా చాటాలని భావిస్తున్నారు. నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి నివాసంలో ఈ మేరకు కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. దసరా తరువాత నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా కాంగ్రెస్‌ పట్ల ప్రజానీకంలో గట్టి నమ్మకాన్ని కలిగించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో దసరా లోపు టికెట్లు ఖరారు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పోటాపోటీగా ఆశావహులు జనాన్ని తరలించే అవకాశం ఉంది. 

నేరడిగొండలో సభా స్థలాన్ని చూపిస్తున్న జాదవ్‌ అనిల్‌కుమార్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top