
సీసీ కెమెరాలతో ప్రజలకు భరోసా
నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రజలకు భరోసా లభిస్తుందని...
నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి
బంజారాహిల్స్ : నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రజలకు భరోసా లభిస్తుందని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు శనివారం ఫిలింనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఈయన ప్రారంభించారు. అనంతరం రామానాయుడు కళామండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంపన్నులు నివసించే ఫిలింనగర్ లాంటి ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే సమాజ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మన పిల్లలు విదేశాల్లో ఒంటరిగా ఉన్నా, క్షేమంగా ఉండటానికి అక్కడున్న ఉన్న వ్యవస్థే కారణమన్నారు.
హైదరాబాద్‌లోనూ అలాంటి భరోసాను కల్పించే చర్యల్లో భాగంగానే కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరాన్ని మరింత ఉన్నతంగా, రక్షణాత్మకంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకుగాను అభివృద్ధి చెందిన దేశాల్లో అమలులో ఉన్న విధానాలను అనుసరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్లోగా నగరంలో లక్ష కెమెరాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఫిలించాంబర్ చుట్టు సీసీ కెమెరాల ఏర్పాటుకు ఫిలింనగర్ సొసైటీ రూ. 3.75 లక్షలు విరాళంగా ప్రకటించి అడ్వాన్స్‌గా రూ. 50 వేల చెక్కును సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ కమిషనర్‌కు అందజేశారు. అంతేకాకుండా క్లబ్ సమీపంలోని ఖాళీ స్థలంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ పి. మురళీకృష్ణ, ఎస్.ఐ గోవర్ధన్‌రెడ్డి, నటులు జీవిత రాజశేఖర్, నిర్మాత సురేష్‌బాబు, జి. ఆది శేషగిరిరావు, విజయ్‌చందర్ తదితరులు పాల్గొన్నారు.