సిద్దిపేట మెడికల్‌ కాలేజీకి | Psycho helmet in HYDERABAD | Sakshi
Sakshi News home page

సిద్దిపేట మెడికల్‌ కాలేజీకి

Jun 7 2017 1:17 AM | Updated on Sep 5 2017 12:57 PM

సిద్దిపేటలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే మెడికల్‌ కాలేజీకి పాక్షిక స్వయం ప్రతిపత్తి కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. సంబంధిత ఫైలును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర కోసం పంపించారు.

పాక్షిక స్వయం ప్రతిపత్తి ముఖ్యమంత్రి వద్దకు ఫైలు పంపిన వైద్య ఆరోగ్య శాఖ
సాక్షి, హైదరాబాద్‌: సిద్దిపేటలో వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే మెడికల్‌ కాలేజీకి పాక్షిక స్వయం ప్రతిపత్తి కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. సంబంధిత ఫైలును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర కోసం పంపించారు. వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది భర్తీ ప్రక్రియ పూర్తిగా సంబంధిత మెడికల్‌ కాలేజీల ద్వారానే చేపట్టాలనేది ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం నిమ్స్‌ కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగానే ఉంటోంది. కర్ణాటకలో అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రులు స్వయం ప్రతిపత్తిని అమలుచేస్తున్నాయని.. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మొదట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సొంత జిల్లాలోని మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీకి పాక్షిక స్వయం ప్రతిపత్తి కల్పించారు.

ప్రభుత్వంపై ఆధారపడకుండా ఖాళీల భర్తీ..
పాక్షిక స్వయం ప్రతిపత్తితో ప్రభుత్వంపై ఆధారపడకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఖాళీలను భర్తీ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం మెడికల్‌ కాలేజీల్లో ఉద్యోగాల్లో చేరే వారు చాలా మంది నెలలు గడవక ముందే తమకు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ లేదా డిప్యూటేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల మారుమూల మెడికల్‌ కాలేజీలకు వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. బదిలీలు, డిప్యూటేషన్ల కారణంగా ఒకవైపు మెడికల్‌ విద్యార్థులకు, మరోవైపు బోధనాసుపత్రుల్లోని రోగులకు శాపంగా మారుతోంది. పాక్షిక స్వయంప్రతిపత్తితో ఈ పరిస్థితికి చెక్‌ పడనుంది. ఈ మెడికల్‌ కాలేజీలో కొత్తగా ఎవరు ఉద్యోగంలో చేరినా రిటైర్‌ అయ్యే వరకు సంబంధిత కాలేజీ లేదా బోధనాసుపత్రిలోనే పనిచేయాలి. ఇతర చోట్లకు బదిలీలు ఉండవు. అందుకు సిద్ధమయ్యే వారే చేరుతారు కాబట్టి సమస్యలు తలెత్తవు.

2018–19 నుంచి 150 ఎంబీబీఎస్‌ సీట్లకు అడ్మిషన్లు
2018–19 నుంచి సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంసీఐ ప్రతినిధి బృందం సిద్దిపేటకు వెళ్లి పరిశీలించాక అక్కడ మెడికల్‌ కాలేజీకి కేంద్రం అనుమతివ్వనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది సిద్దిపేట మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 150 ఎంబీబీఎస్‌ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరనుంది. నర్సింగ్‌ సీట్లకు కూడా అనుమతి కోరాలని ప్రభుత్వం యోచిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement