టీఆర్‌ఎస్‌తోనే ముస్లింల అభ్యున్నతి

The progress of Muslims with the TRS party - Sakshi

 ముస్లిం మహిళా సదస్సులో హోంమంత్రి మహమూద్‌ అలీ

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీతోనే ముస్లింల అభ్యున్నతి సాధ్యమని, రాష్ట్రంలోని మైనార్టీ పిల్లలకోసం కేసీఆర్‌ ప్రభుత్వం చేస్తున్నట్లుగా దేశంలోని ఏ రాష్ట్రమూ ఖర్చు చేయడం లేదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ముస్లిం అమ్మాయిల విద్యారేటు తక్కువగా ఉందని, వారు కూడా ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని సూచించారు. చంచల్‌గూడ మైదానంలో ఆదివారం జమియతుల్‌ మొమినాత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మైనార్టీ పిల్లల కోసం సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన 204 రెసిడెన్షియల్స్‌ స్కూళ్లలో 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ఒక్కో మైనార్టీ విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ.1.25లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 

ఆకాశంలో సగం.. ఆదాయంలోనూ సగం 
మహిళలు ఆకాశంలో సగమని, ఇంటి ఆదాయంలో నూ సగంగా ఉండాలని హోంమంత్రి పిలుపునిచ్చా రు. ముస్లిం కుటుంబాలు వృథా ఖర్చులు మానుకో వాలని, మహిళలు తమ కుటుంబ ఆదాయం ప్రకార మే బడ్జెట్‌ రూపొందించుకోవాలన్నారు. బాల్యంనుంచే పిల్లల్ని నైతికత, క్రమశిక్షణతో పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. పేద మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 20 లక్షలు ఉచితంగా అందిస్తోందని దీన్ని వారంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

అనంతరం మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, మతగురువు అల్లామా ఉబెదుల్లాఖాన్‌ మాట్లాడుతూ.. మహిళల వ్యక్తిగత, సామూహిక, దాంపత్య జీవితానికి సంబంధించిన ఇస్లామీ షరియత్‌లో కేంద్ర ప్రభుత్వం జోక్యం పట్ల ముస్లిం మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. ముస్లిం మహిళల హక్కును కేంద్రం కాలరాస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింలు, లౌకికవాదులంతా కలసి బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ మహ్మద్‌ ఖమురుద్దీన్, జమియతుల్‌ మొమినాత్‌ సంస్థ అధ్యక్షుడు ముఫ్తీ మస్తాన్‌అలీ, హఫెజ్‌ సాబెర్‌పాషా, ముఫ్తీ హసనుద్దీన్‌తో పాటు పలువురు మతగురువులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top