స్ఫూర్తి గానం!

Private Album Singer Geetha Special Story - Sakshi

‘రాత’ మార్చి.. ‘గీత’ కూర్చి

‘మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులాదాగినావుగా’ ఈ పాట వినిపిస్తే చాలు అలా అలా పాటంతా అలవోకగా పాడేసే సిటీ యూత్‌ చాలా మందే ఉన్నారు. అయితే.. ఓ అమ్మాయి కోసం అబ్బాయి పాడిన ఈ పాటనే అమ్మాయిలు కూడా పాడేసుకుంటున్నారు. కానీ అబ్బాయిల్ని ఉద్దేశించి పాడినప్పుడు సాహిత్యం మారితే మరింత బాగుంటుంది కదా? సిటీకి చెందిన టీనేజ్‌
గర్ల్స్‌లో వచ్చిన ఈ ఆలోచన సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికింది.

సాక్షి, సిటీబ్యూరో : ‘చిన్నప్పటి నుంచీ నాకు పాడడం అంటే ఇష్టం’ అని చెప్పింది స్ఫూర్తి. నగరంలోని ఎస్సార్‌నగర్, ఈఎస్‌ఐ ప్రాంతంలోని వికాస్‌పురి కాలనీలో నివసించే ఈ బీఎస్సీ స్టూడెంట్‌కి పాడడం అంటే ఉండే ఈ ఇష్టంలో విశేషం లేకపోవచ్చు. కానీ..‘మూడేళ్ల వయసులోనే ఇంట్లో ఏవైనా నాలుగైదు వస్తువులు చూస్తే చాలు అప్పటికప్పుడు పాట అల్లేసి పాడేదాన్ని. అలా మా చెల్లి మీద కూడా రాసి పాడాను’ అంటూ ఆమె గుర్తు చేసుకుంటున్నప్పుడు మాత్రం ఔరా అనిపించకమానదు. ‘నాకున్న ఆ డిఫరెంట్‌ టాలెంట్‌ గురించి నా చిన్నప్పుడే ఓ ఆంగ్ల పత్రికలో వచ్చింది. అప్పటి నుంచి ఇంకా పాడడం ఎక్కువైంది’ అంటున్న స్ఫూర్తి.. అత్యంత పిన్న వయసులోనే సినిమాలకు పాడిన యంగెస్ట్‌ సింగర్‌ కూడా. ‘యమహో యమ అనే సినిమాలో తొలి పాట పాడాను. తద్వారా యంగెస్ట్‌ సింగర్‌గా తెలుగు బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నా పేరు నమోదైంది. ఆ తర్వాత కిక్‌ 2, లోఫర్, ఇజం.. ఇలా నాలుగైదు సినిమాల్లో పాడాను’ అంటూ చెప్పింది.  

అబ్బాయిని ఏ‘మార్చేసి’..
‘పిల్లా రా పాట ట్రైన్‌ జర్నీలో విన్నాను. చాలాసార్లు విన్నాను. బాగా నచ్చింది. పాడుకుంటూ ఉంటే అమ్మాయిని సంబోధిస్తూ పాడడం ఎందుకో నాకు నప్పలేదనిపించి.. అప్పటికప్పుడు అమ్మాయి వెర్షన్‌గా కొన్ని వాక్యాలు మార్చి పాడాను. అలా తొలిసారి 1 నిమిషం పాటను రాసి సరదాగా అప్‌లోడ్‌ చేశాను. దీనికి 2 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఆ తర్వాత మ్యాంగో మ్యూజిక్‌ వాళ్ల సంప్రదించారు. వాళ్ల కోరిక మేరకు పూర్తి పాటను మార్చి రాసి అప్‌లోడ్‌ చేస్తే 4 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. దీనికి సూర్య అనే ఫ్రెండ్‌ గిటారిస్ట్‌గా వ్యవహరించాడు’ అంటూ చెప్పుకొచ్చింది స్ఫూర్తి. తాజాగా హుషారు సినిమాలోని ఉండిపోరా (విషాదభావం) అనే హిట్‌ సాంగ్‌ని ఫిమేల్‌ వెర్షన్‌లోకి మార్చి పాడిన స్ఫూర్తి ‘ఉండిపోతారా’ అంటూ బదులిచ్చినట్టుగా రాసి పాడడం  ద్వారా ఇందులో మరో కొత్త ప్రయోగం జోడించింది. కేవలం వారం రోజుల్లోనే ఇది టాప్‌ త్రీలో నిలవడం విశేషం. ప్రస్తుతం వెస్ట్రన్‌ మ్యూజిక్‌ నేర్చుకుంటున్న స్ఫూర్తి.. త్వరలో 2018లోని హాట్‌సాంగ్స్‌ అన్నీ గుదిగుచ్చి మాషప్‌ రూపొందించనున్నానని, మంచి గాయనిగా కావాలనేదే లక్ష్యమని, సొంత కంపోజిషన్‌ చేయనున్నానని చెప్పింది. అరుదుగా మాత్రం మేల్‌ సాంగ్‌కి ఫిమేల్‌ వెర్షన్‌ని రాసి పాడతానంటోంది. ఆల్‌ ద బెస్ట్‌ స్ఫూర్తి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top