
హైదరాబాద్: అక్రమంగా అరెస్టు చేసిన విరసం సభ్యుడు పృథ్వీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి చందన్‌లను బేషరతుగా విడుదల చేయాలని విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం ఆధ్వర్యంలో ప్రశ్నించే కలాలు, కళలపై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వరవరరావు మాట్లాడుతూ, మార్చి 27న పృథ్వీ, చందన్‌లను గన్నవరంలో కిడ్నాప్ చేశారని ఆరోపించారు.
వీసీ అప్పారావును హత్య చేసేందుకు మావోయిస్టు నేతలు చంద్రన్న, హరిభూషణ్‌లతో కలసి కుట్ర చేశారంటూ వారిని అరెస్టు చేశామని చెప్పటం సిగ్గు చేటన్నారు. దళితులు, ఆదివాసీలపై చేస్తున్న దాడులను సమర్థించుకోవటానికే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో విరసం నగర కన్వీనర్ గీతాంజలి, విరసం సభ్యులు శివరాత్రి సుధాకర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.