ఆశనిరాశల ఖరీఫ్‌..!

Prepared agricultural department Seeds, fertilizer - Sakshi

     ఆహారధాన్యాలు ఢీలా.. పత్తి భళా

     97 లక్షల ఎకరాల్లో పంటల సాగు

     పత్తి విస్తీర్ణమే 48 లక్షల ఎకరాలు

     వచ్చే నెల 1 నుంచి ప్రారంభంకానున్న రబీ

     విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఖరీఫ్‌ ఆశనిరాశల మధ్య ముగిసింది. ఇక వచ్చే నెల 1 నుంచి రైతులు రబీ పనుల్లో మునిగిపోనున్నారు. ఈ ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల కంటే పత్తి పంటే ఎక్కువగా సాగైంది. వర్షాలు పూర్తిస్థాయిలో లేకపోవడం.. జలాశయాలు, చెరువులు నిండకపోవడంతో వరి విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఈసారి 97.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన ఖరీఫ్‌ చివరి నివేదికలో తెలిపింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, ఈసారి ఏకంగా 47.72 లక్షల(114%) ఎకరాల్లో సాగు కావడం విశేషం.

గతేడాది పత్తి వేయొద్దని ప్రభుత్వం చెప్పడంతో 2016 ఖరీఫ్‌లో 31 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. కానీ అప్పట్లో పత్తికి మార్కెట్లో డిమాండ్‌ పెరిగి మంచి రేటు రావడంతో ఈసారి రైతులు పత్తివైపు మొగ్గు చూపారు. ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 48.70 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 40.72 లక్షల ఎకరాల్లోనే సాగయ్యాయి. ఏకంగా 8 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 19.07 లక్షల(82%) ఎకరాలకే పరిమితమైంది. ఆహారధాన్యాల్లో కీలకమైన పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, 9.27 లక్షల ఎకరాలు సాగైంది.

10 జిల్లాల్లో లోటు..
నైరుతీ రుతుపవనాలు మొదట్లో ఊపందుకున్నా, ఆ తర్వాత ఉధృతి తగ్గింది. దీంతో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నాలుగు నెలల కాలంలో లోటు వర్షపాతమే నమోదైంది. జూన్‌లో 47 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, జూలైలో 40 శాతం లోటు నమోదై పరిస్థితి తిరగబడింది. ఆగస్టులో 12 శాతం, సెప్టెంబర్‌లో 19 శాతం లోటు వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం కారణంగా ఈ నాలుగు నెలల కాలంలో కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, జయశంకర్‌ భూపాలపల్లి, వికారాబాద్, మెదక్‌ జిల్లాల్లో లోటు వర్షపాతం రికార్డు అయింది. హైదరాబాద్, మేడ్చల్, గద్వాల జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది.

రబీకి సన్నద్ధం..
రానున్న రబీ సాగు కోసం ప్రభుత్వం సన్నద్ధమైంది. వచ్చే నెల 1 నుంచి రబీ సాగు మొదలు కానుండటంతో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. రబీకి కేంద్రం 12.10 లక్షల టన్నుల ఎరువులు కేటాయించగా, ఇప్పటికే డీలర్లు, మార్క్‌ ఫెడ్, కంపెనీల వద్ద 6.35 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయి. 5.82 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. 1.64 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 1.33 లక్షల క్వింటాళ్ల శనగ, 2.38 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top