గ్రామాల్లో అభివృద్ధి పనుల ‘పవర్‌’ ఎవరికి..?

Power' Of Development Works In Villages? - Sakshi

గ్రామపంచాయతీల్లో చెక్‌పవర్‌పై స్పష్టత కరవు

జాయింట్‌ చెక్‌పవర్‌ అంశాన్ని హోల్డ్‌లో పెట్టిన ప్రభుత్వం

అభివృద్ధి పనులకు సొంత డబ్బు ఖర్చు..! 

ఉత్తర్వుల కోసం సర్పంచ్‌లు, పాలకవర్గాల ఎదురుచూపులు 

సాక్షి, మెదక్‌ అర్బన్‌ : గ్రామల్లో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం సర్పంచ్‌లతో పాటు ఉపసర్పంచ్‌లకు ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో చెక్‌పవర్‌ విషయంలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సమష్టి అధికారాన్ని కొత్త చట్టం కల్పించింది. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమలు చేయగా సర్పంచ్, ఉపసర్పంచ్‌ల జాయింట్‌ చెక్‌పవర్‌ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా హోల్డ్‌లో పెట్టింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో  కొత్త పంచాయతీలకు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు తమ అధికార బాధ్యతలను గత నెల (ఫిబ్రవరి) 2వ తేదీన స్వీకరించారు. అలాగే తొలి పంచాయతీ గ్రామసభ, సమావేశాలను కూడా నిర్వహించడం జరిగింది.

స్పష్టత కరవు..
అధికారుల బదలాయింపు జరుగుతుండగా ఆర్థిక లావాదేవీల బదలాయింపులు కూడా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కానీ జాయింట్‌ చెక్‌పవర్‌ అంశంపై స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. జాయింట్‌ చెక్‌పవర్‌కు సంబంధించి చట్టంలో నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం త్వరలోనే ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేస్తుందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం కొత్తగా ఎన్నికైన ఉపసర్పంచ్‌లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి జాయింట్‌ చెక్‌పవర్‌ ఉత్తర్వులను జారీ చేయాలని కోరుతున్నారు.

 తప్పని తిప్పలు...
చెక్‌పవర్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో జిల్లాలోని గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, పాలకవర్గాలకు తిప్పలు తప్పడంలేదు. గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రం చేయడం, పారిశుద్ధ్యం, వీధిదీపాలు ఏర్పాటు చేయడం వంటివి ఎప్పటికప్పుడూ చేయాల్సిన పనులు. అయితే వీటికి వెచ్చించాల్సిన నిధులకు ఎలాంటి ఆర్థిక వనరులు లేకపోవడంతో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు తమ సొంత ఖర్చులతో కొన్ని పనులు చేయిస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో నీటి కోసం కొత్తగా మోటార్ల కొనుగోలు, పాత మోటార్లు రిపేరింగ్‌ చేయించడం, వాటర్‌ ట్యాంకులు ఏర్పాటు చేయడం వంటి వాటికి వేల రూపాయల్లో ఖర్చులు చేయాల్సి వస్తోంది. అలాగే గ్రామపంచాయతీల్లో పనిచేసే కార్మికులకు జీతాలు చెల్లించాడానికి కూడా నిధులు లేకపోవడం, వీరికి చెక్‌పవర్‌ రాకపోవడం చాలా ఇబ్బందికరంగా మారింది.

జిల్లాలో 469 సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు..
జిల్లావ్యాప్తంగా మొత్తం 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామపంచాయతీల్లో 469 మంది సర్పంచ్‌లు, 469మంది ఉపసర్పంచ్‌లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం వీరి అధ్యక్షతన పంచాయతీల్లో గ్రామసభలు జరిగాయి.

లావాదేవీలన్నీ ఇద్దరితోనే...
పంచాయతీ ఆర్థిక లావాదేవీలన్నీ కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల ద్వారానే కొనసాగనున్నాయి. ఆర్థిక లావాదేవీల అధికారం బదలాయింపు జరుగుతుండటంతో చెక్‌పవర్‌ అంశం ప్రస్తుతం గ్రామాల్లో చర్చనీయాంశమైంది. జాయింట్‌ చెక్‌పవర్‌ అంశాన్ని హోల్డ్‌లో పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుందని పంచాయతీరాజ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

గ్రామ పంచాయతీ మొదటివిడత గ్రామసభ, సమావేశాలు ఆయా గ్రామాల్లో ఇప్పటికే నిర్వహించారు. జాయింట్‌ చెక్‌పవర్‌కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఎప్పుడు జారీచేస్తుందోనని విషయాలు అధికారులు చెప్పలేకపోతున్నారు.

సొంత డబ్బులతో పనులు.. 
గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగి సర్పంచ్‌గా ఎన్నికైనా ఇంతవరకు చెక్‌పవర్‌ రాకపోవడంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఇబ్బందులు తప్పడంలేదు. నేను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత గ్రామంలో చాలా అభివృద్ధి పనులను చేపట్టాను. గ్రామాభివృద్ధికోసం ఇప్పటి వరకు సుమారు రూ.2 లక్షల వరకు సొంత డబ్బుల.ు ఖర్చు చేశాను. గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాను. సర్పంచ్‌ల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని చెక్‌పవర్‌ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.     
  – పరశురామ్‌రెడ్డి, సర్పంచ్, అజ్జిమర్రి, చిలిప్‌చెడ్‌ మండలం

త్వరగా నిర్ణయం తీసుకోవాలి.. 
తాము సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించి రెండునెలలు కావస్తున్నా ఇప్పటి వరకు చెక్‌పవర్‌ రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో గ్రామంలోని అన్ని చోట్ల నీటి ఎద్దడి నివారణకు పాత బోరు మోటార్లు రిపేరు చేయించడం జరిగింది. అలాగే కొత్తవి కొనుగోలు చేశాము. ఇవన్నీ సొంత డబ్బులతో చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం చెక్‌పవర్‌ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. 
– మహిపాల్‌రెడ్డి, సర్పంచ్, లింగ్సాన్‌పల్లి, హవేళిఘణపూర్‌ మండలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top