breaking news
naraya khed
-
గ్రామాల్లో అభివృద్ధి పనుల ‘పవర్’ ఎవరికి..?
సాక్షి, మెదక్ అర్బన్ : గ్రామల్లో కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌లతో పాటు ఉపసర్పంచ్‌లకు ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో చెక్‌పవర్ విషయంలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సమష్టి అధికారాన్ని కొత్త చట్టం కల్పించింది. ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు చేయగా సర్పంచ్, ఉపసర్పంచ్‌ల జాయింట్ చెక్‌పవర్ అంశాన్ని ప్రభుత్వం ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా హోల్డ్‌లో పెట్టింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కొత్త పంచాయతీలకు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు తమ అధికార బాధ్యతలను గత నెల (ఫిబ్రవరి) 2వ తేదీన స్వీకరించారు. అలాగే తొలి పంచాయతీ గ్రామసభ, సమావేశాలను కూడా నిర్వహించడం జరిగింది. స్పష్టత కరవు.. అధికారుల బదలాయింపు జరుగుతుండగా ఆర్థిక లావాదేవీల బదలాయింపులు కూడా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. కానీ జాయింట్ చెక్‌పవర్ అంశంపై స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొంది. జాయింట్ చెక్‌పవర్‌కు సంబంధించి చట్టంలో నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం త్వరలోనే ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేస్తుందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం కొత్తగా ఎన్నికైన ఉపసర్పంచ్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి జాయింట్ చెక్‌పవర్ ఉత్తర్వులను జారీ చేయాలని కోరుతున్నారు. తప్పని తిప్పలు... చెక్‌పవర్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో జిల్లాలోని గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, పాలకవర్గాలకు తిప్పలు తప్పడంలేదు. గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రం చేయడం, పారిశుద్ధ్యం, వీధిదీపాలు ఏర్పాటు చేయడం వంటివి ఎప్పటికప్పుడూ చేయాల్సిన పనులు. అయితే వీటికి వెచ్చించాల్సిన నిధులకు ఎలాంటి ఆర్థిక వనరులు లేకపోవడంతో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు తమ సొంత ఖర్చులతో కొన్ని పనులు చేయిస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో నీటి కోసం కొత్తగా మోటార్ల కొనుగోలు, పాత మోటార్లు రిపేరింగ్ చేయించడం, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం వంటి వాటికి వేల రూపాయల్లో ఖర్చులు చేయాల్సి వస్తోంది. అలాగే గ్రామపంచాయతీల్లో పనిచేసే కార్మికులకు జీతాలు చెల్లించాడానికి కూడా నిధులు లేకపోవడం, వీరికి చెక్‌పవర్ రాకపోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో 469 సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు.. జిల్లావ్యాప్తంగా మొత్తం 469 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామపంచాయతీల్లో 469 మంది సర్పంచ్‌లు, 469మంది ఉపసర్పంచ్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం వీరి అధ్యక్షతన పంచాయతీల్లో గ్రామసభలు జరిగాయి. లావాదేవీలన్నీ ఇద్దరితోనే... పంచాయతీ ఆర్థిక లావాదేవీలన్నీ కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల ద్వారానే కొనసాగనున్నాయి. ఆర్థిక లావాదేవీల అధికారం బదలాయింపు జరుగుతుండటంతో చెక్‌పవర్ అంశం ప్రస్తుతం గ్రామాల్లో చర్చనీయాంశమైంది. జాయింట్ చెక్‌పవర్ అంశాన్ని హోల్డ్‌లో పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంటుందని పంచాయతీరాజ్ అధికారులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ మొదటివిడత గ్రామసభ, సమావేశాలు ఆయా గ్రామాల్లో ఇప్పటికే నిర్వహించారు. జాయింట్ చెక్‌పవర్‌కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఎప్పుడు జారీచేస్తుందోనని విషయాలు అధికారులు చెప్పలేకపోతున్నారు. సొంత డబ్బులతో పనులు.. గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగి సర్పంచ్‌గా ఎన్నికైనా ఇంతవరకు చెక్‌పవర్ రాకపోవడంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఇబ్బందులు తప్పడంలేదు. నేను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత గ్రామంలో చాలా అభివృద్ధి పనులను చేపట్టాను. గ్రామాభివృద్ధికోసం ఇప్పటి వరకు సుమారు రూ.2 లక్షల వరకు సొంత డబ్బుల.ు ఖర్చు చేశాను. గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాను. సర్పంచ్ల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని చెక్‌పవర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – పరశురామ్రెడ్డి, సర్పంచ్, అజ్జిమర్రి, చిలిప్‌చెడ్ మండలం త్వరగా నిర్ణయం తీసుకోవాలి.. తాము సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించి రెండునెలలు కావస్తున్నా ఇప్పటి వరకు చెక్‌పవర్ రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం వేసవికాలం కావడంతో గ్రామంలోని అన్ని చోట్ల నీటి ఎద్దడి నివారణకు పాత బోరు మోటార్లు రిపేరు చేయించడం జరిగింది. అలాగే కొత్తవి కొనుగోలు చేశాము. ఇవన్నీ సొంత డబ్బులతో చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం చెక్‌పవర్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. – మహిపాల్‌రెడ్డి, సర్పంచ్, లింగ్సాన్‌పల్లి, హవేళిఘణపూర్ మండలం -
లారీ, బైక్ ఢీ: ఒకరి మృతి
నిజాంసాగర్: ఎదురుగా వస్తున్న బైక్‌ను చెరుకు లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీ కొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని మాగి గ్రామానికి చెందిన గుర్రపు అనిల్(35), చింతకింది శేఖర్(34)ఆదివారం నారాయణఖేడ్‌లో తమ బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్తుండగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నిజాంపేట సమీపంలోని బొక్కలకుంట దర్గా వద్ద మూల మలుపు వద్ద చెరుకు లోడ్‌తో నారాయణఖేడ్ వైపు నుంచి వెళ్తున్న లారీ ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. వారి బైక్ నుజ్జయింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నిజాంపేట సర్పంచ్ సాయిరెడ్డి హుటాహుటిని అక్కడికి చేరుకుని 108 అంబులెన్స్‌కు సమాచారమిచ్చారు. వారిని నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో గాయాలైన అనిల్, శేఖర్‌కు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. జోగిపేట సమీపంలోకి చేరుకునే సరికి అనిల్ మృతిచెందాడు. దీంతో శేఖర్‌ను హైదరాబాద్‌కు తరలించారు. మృతిచెందిన అనిల్‌కు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. బైక్‌ను ఢీకొట్టిన చెరుకు లారీని నిజాంపేట వద్ద గ్రామస్తులు ఆపి వేశారు. నారాయణఖేడ్ ఎస్ఐ నరేందర్ సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. -
నేడు కేసీఆర్ సుడిగాలి పర్యటన
నారాయణఖేడ్, జహీరాబాద్/జోగిపేట, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేటలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. నారాయణఖేడ్‌లోని రహమాన్ ఫంక్షన్ హాల్ సమీపంలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహణకు లోక్‌సభ అభ్యర్థి బీబీ పాటిల్, ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి భూపాల్‌రెడ్డి, ఇతర నేతల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12గంటలకు సభ జరగనుం ది. సభా ప్రాంగణాన్ని పార్టీ నాయకులతోపాటు ఖేడ్ సీఐ నందీశ్వర్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. జహీరాబాద్‌లోని ఆర్టీసీ బస్డాండ్ వెనుక భాగంలో గల మైదానంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సభ జరగనుంది. ఏర్పాట్లను ఆ పార్టీ నాయకులు ఎం.శివకుమార్, పి.నర్సింహా రెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. ఉత్తమ్ గార్డెన్ వద్ద హెలీపాడ్‌ను నిర్మించారు. ఈ ప్రాంతాన్ని సంగారెడ్డి డీఎస్పీ వెంకటేశ్, జహీరాబాద్ సీఐ నరేందర్, ఎస్ఐ శివలింగం పరిశీలించారు. జోగిపేటలో కేసీఆర్ బహిరంగ సభ ఉన్నందున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, అందోల్ టీఆర్ఎస్ ఇన్చార్జి పి.కిష్టయ్య, నాయకులు పి.శివశేఖర్, డీబీ నాగభూషణం, నర్సింగ్‌రావు తదితరులు శుక్రవారం సభా ప్రాంగణాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్‌కు జోగిపేటకు రానున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ తెలిపారు. టీచర్స్ కాలనీ వెనుక భాగంలోని రాచప్ప వ్యవసాయ భూమిలో హెలీపాడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.