గిరిజనుల వివాదంపై విచారణ వాయిదా 

Postpone trial on tribal dispute - Sakshi

     రిట్‌ పిటిషన్ల కొట్టివేత, ఎస్‌ఎల్‌పీకి అనుమతించిన సుప్రీంకోర్టు 

     బంజారా, లంబాడీ, సుగాలీలు ఎస్టీలు కాదన్న పిటిషనర్లు  

సాక్షి, న్యూఢిల్లీ: బంజారా, లంబాడీ, సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ వివాద పరిష్కారం న్యాయస్థానం పరిధిలో లేదని, పార్లమెంటరీ వ్యవస్థ పరిధిలో ఉందని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ గోండ్వానా వెల్ఫేర్‌ సొసైటీ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, ఎస్టీ జాబితా నుంచి వారిని తొలగించాలని కోయ తెగలకు చెందిన ‘ఆదివాసీ (గిరిజన) ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌’, రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్, ఆధార్‌ సొసైటీ, ఎ.దేవేందర్‌ తదితరులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.

కానీ ఎస్‌ఎల్‌పీలో ఇంప్లీడ్‌ కావొచ్చని, రెండు వారాల తర్వాత దీన్ని విచారిస్తామని పేర్కొంది. ఎస్‌ఎల్‌పీలో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని పిటిషనర్ల తరఫు న్యాయవాది రమేశ్‌ అల్లంకి తెలిపారు. శుక్రవారం ఈ పిటిషన్లు ధర్మాసనం ముందుకు రాగానే ఆదివాసీల పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎం.ఎన్‌.రావు, వికాస్‌ సింగ్‌ తమ వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీ ఉత్తర్వుల సవరణ చట్టం–1976 ద్వారా బంజారా, లంబాడీ, సుగాలీలను ఎస్టీలుగా గుర్తించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 342ని ఉల్లంఘించడమేనన్నారు.   

అసలైన వారికి అన్యాయం.. 
ఎస్సీ, ఎస్టీ ఉత్తర్వుల (సవరణ) చట్టం, 1976 ద్వారా బంజారాలను ఎస్టీలుగా గుర్తించడం వల్ల తెలంగాణలోని అసలైన గిరిజనులకు విద్యా, ఉద్యోగాలు, పదోన్నతులు, చట్టసభల్లో ప్రాతినిథ్యం తదితర రంగాల్లో తీరని నష్టం వాటిల్లిందని ఆదివాసీలు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రం భారత్‌లో విలీనమైన సందర్భంలో ఆంధ్రా ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఉందని, ఆ సమయంలో లంబాడా, సుగాలీలను ఆంధ్రాలో ఎస్టీలుగా గుర్తించారు.. కానీ హైదరాబాద్‌ స్టేట్‌లో కాదని వివరించారు. 1956 నాటి ఉత్తర్వుల అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ జిల్లాల్లో సుగాలీ, లంబాడీలను ఎస్టీలుగా పరిగణించలేదన్నారు. 1976లో అప్పటి కేంద్ర హోం మంత్రి బ్రహ్మానందరెడ్డి ఎస్సీ, ఎస్టీ ఉత్తర్వులు (సవరణ) బిల్లు తెచ్చారని, ఎస్సీ, ఎస్టీ జాబితా నుంచి కులాల చేర్పులు, తొలగింపులకు సంబంధించినదైనప్పటికీ.. ఈ బిల్లు చర్చకు వచ్చిన సందర్భంగా కులాల చేర్పులను కొన్ని ప్రాంతాలకు ఆంక్షలు విధించడం సరికాదన్న నిర్ణయానికి వస్తూ తెలంగాణ జిల్లాల్లోనూ బంజారాలను ఎస్టీలుగా పరిగణించారని వివరించారు.

కానీ బంజారాలను ఎస్టీలుగా పరిగణించినప్పుడు సరైన సామాజిక, ఆర్థిక అధ్యయనం జరగలేదని, కేవలం ప్రాంతాల ఆంక్షల తొలగింపు ప్రాతిపదికన చేశారన్నారు. దీనిపై బంజారాల తరఫున సీనియర్‌ న్యాయవాదులు రాజీవ్‌ ధావన్, ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి తమ వాదనలు వినిపించగా.. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా.. ఈ విషయంపై హైకోర్టుకే వెళ్లాలని సూచించారు. అయితే హైకోర్టు కూడా ఇదే అంశంపై గత నెలలో ఉత్తర్వులిచ్చిందని, వాటిని సవాలు చేస్తూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ కూడా ఇదే ధర్మాసనం వద్ద ఉందని న్యాయవాది వికాస్‌సింగ్‌ వివరించారు. ఆ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అప్లికేషన్‌ దాఖలు చేసుకోవచ్చని విచారణను వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top