పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌ కాస్టింగ్‌ 

Polling Bumps With Webcasting - Sakshi

సీసీ కెమెరాల ఏర్పాటు 

బూత్‌ల నిర్వహణ ఏర్పాట్లలో అధికారుల తలమునకలు

ఆదేశాలు జారీ చేసిన రిటర్నింగ్‌ అధికారి 

ఖిమ్యానాయక్‌ ఆదివారం నామినేషన్లకు సెలవు  

వేములవాడ: అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు రిటర్నింగ్‌ అధికారి ఖిమ్యానాయక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ 54 సమస్యాత్మక బూత్‌లను అధికారులు గుర్తించారని తెలిపారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సమస్యాత్మక బూత్‌లతోపాటు సాధారణ బూత్‌లలో సైతం ఇలాంటి చర్యలు చేపట్టాలని సూచిస్తే తప్పకుండా నియోజకవర్గంలోని 235 కేంద్రాల్లో వెబ్‌క్యాస్ట్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులచే వెబ్‌ క్యాస్టింగ్‌కు నియమిస్తున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని, ల్యాప్‌టాప్‌ కలిగిన యవతరం వెబ్‌ క్యాస్టింగ్‌కు అర్హులని ఆయన తెలిపారు. 

అలాగే బూత్‌ల నిర్వహణ సక్రమంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటికే ప్రతీ బూత్‌ల వద్ద ర్యాంప్‌ల నిర్మాణం చేపట్టాలని, అనేక ప్రాంతాల్లో ర్యాంప్‌ల నిర్మాణాలు దాదాపు పూర్తయినట్లు ఆయన తెలిపారు. అలాగే విద్యుత్‌ సరఫరా, నీటి సౌకర్యం, వృద్ధులు, వికలాంగులకు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నట్లు చెప్పారు. దీంతో అధికారులు, సిబ్బంది గ్రామగ్రామాన ప్రతీ పోలింగ్‌ స్టేషన్లో సరైన ఏర్పాట్లు చేసేందుకు పనులు ప్రారంభించారు. పౌరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా రిటర్నింగ్‌ అధికారిని సంప్రదించవచ్చని, లేదా వేములవాడ నియోజకవర్గం టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 425 3465 కాల్‌ చేసి చెప్పవచ్చన్నారు.  

ఆదివారం నామినేషన్లకు సెలవు... 
ఈనెల 12న నోటిఫికేషన్‌ వెలువడటంతోపాటు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈనెల 19 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. అయితే మధ్యలో ఆదివారం సెలవు దినం రావడంతో ఆ రోజు నామినేషన్లు వేసేందుకు లేదని ఆయన తెలిపారు. 

19తో ముగియనున్న నామినేషన్ల పర్వం
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 12 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభించిన రిటర్నింగ్‌ అధికారులు ఈనెల 19 మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు దాఖలు చేసే వాళ్లు తమ కార్యాలయానికి రావచ్చని, ఎన్నికల నిబంధనల మేరకు తమ నామినేషన్‌ పత్రాలు అందజేయవచ్చని సూచించారు. 20న నామినేషన్ల పరిశీలన, 22 వరకు విత్‌డ్రాలు, వచ్చేనెల 7న ఉదయం 7 గంటల నుచి సాయంత్రం 8 గంటల వరకు పోలింగ్,11న సిరిసిల్ల మండలం బద్దెనపల్లిలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వచ్చేనెల 13తో ఎన్నికల బాధ్యతలు పూర్తవుతాయని ఆయన తెలిపారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top