రాజుకున్న రాజకీయ వేడి 

Political Leaders Disputes In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: వారిద్దరు అధికారి పార్టీ నాయకులు.. కానీ ఒకరంటే ఒకరికి పడదని ఆరోపణలు బయటకు పొక్కుతున్నాయి. వారి మధ్య సయోధ్య కుదురడం లేదనే తెలిసింది. మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మ న్‌ పుట్ట మధుకర్, కాళేశ్వరాలయ మాజీ చైర్మ న్‌ బొమ్మెర వెంకటేశం మధ్య వైరం తీవ్రస్థాయికి చేరిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.  

మరోమారు వరించిన అదృష్టం.. 
కాళేశ్వరాలయ పాలక మండలి గడువు ముగియండతో కొత్త పాలకవర్గం నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేటకు చెందిన బొమ్మెర వెంకటేశం సీఎం కేసీఆర్‌కు బాల్యమిత్రుడు కావడంతో రెండోసారి కూడా అవకాశం కల్పించారు. అయితే స్థానికంగా ఉన్న నాయకులను కాదని స్థానికేతరుడికి వరుసగా రెండుసార్లు అవకాశాలు కల్పించారని పుట్ట మధుకర్‌ మనోవేదనకు గురైనట్లు తెలిసింది. క్రితం సారి కూడా పుట్ట మధు  మంథని  నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన అనుచరుడికి కాళేశ్వరాలయ చైర్మన్‌ పదవిని కట్టబెట్టాలని ఆశించారు.

కానీ కేసీఆర్‌ స్నేహితుడి రూపంలో భంగపాటు తప్పలేదు. ఆ సమయంలో మధుకర్‌ అనుచరుడు కాటారంకు చెందిన లచ్చిరెడ్డికి ఆలయ చైర్మన్‌ పదవి రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్‌ల మధ్య దూరం పెరుగుతూ వస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. తన అనుచరుడిని కాదని ఇతర జిల్లాకు చెందిన వ్యక్తికి పదవి కట్టబెట్టడంతో పుట్ట మధుకర్‌ అప్పటి చైర్మన్‌ వెంకటేశంపై విముఖతతో ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.  

నేటి కార్యక్రమం వాయిదా.. 
నేటి నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ కమిషనర్‌ అనిల్‌కుమార్‌తో పాటు రాష్ట్ర ముఖ్యులకు కాబోయే చైర్మన్‌ బొమ్మెర వెంకటేశం ఆహ్వానాలు  పంపారు. హంగుఆర్భాటాలతో ప్రమాణస్వీకారం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇదంతా జరుగుతున్నా టీఆర్‌ఎస్‌ మంథ«ని నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌కు ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయాన్ని పాలకమండలి కనీసం ఫోన్‌ ద్వారాకూడా తెలుపలేదు.

ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే వద్దకు ఈఓ మారుతి, డైరెక్టర్ల బృందంతో కలిసి వెంకటేశం వెళ్లారు. ఆయన నివాసంలో వెంకటేశం ఒంటెత్తు పోకడపైన మధుకర్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొంత సేపు తన ఆలయం నిర్వహణ బాధ్యతలు సరిగా  చేపట్టలేదని తన నియోజకర్గంలో కూడా చైర్మన్‌ పదవికి అర్హులు ఉన్నట్లు ఆయనతో బాహాటంగానే పేర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. తమకు ముందస్తుగా ఆహ్వానం లేనందున ఇతర కార్యక్రమాలు ఉండడంతో జయశంకర్‌ భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్‌తో కలిసి మరో తేదీని నిర్ణయిస్తామని తెలిపి పంపారు. ప్రమాణ స్వీకారం వాయిదా వేయాలని ఈఓ, డైరెక్టర్లకు సూచించారు. 

ఆదిలోనే అడ్డంకులు 
ప్రమాణ స్వీకారం ఈనెల 14న సోమవారం ఉదయం 10.12గంటలకు చేయాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పాలకమండలికి ఆదిలోనే అడ్డంకులు వచ్చాయి. దీంతో ఇద్దరి మధ్య వైరం ఒక్కసారిగా బయటకు పొక్కింది. దీనిపై మండలంతో పాటు మంథని నియోజకవర్గం స్థాయిలో చర్చ సాగుతోంది. కాగా పాలకమండలిలో 15 మంది డైరెక్టర్లు ఉండగా 13మంది డైరెక్టర్లు పుట్ట మధుకర్‌కు చెందివారు కాగా కాబోయే చైర్మన్‌ వెంకటేశం మాత్రమే సీఎం అనుచరుడిగా బరిలో ఉన్నారు. మరొక్కరు ఎక్స్‌అపీషియో మెంబర్‌గా అర్చకుడిని తీసుకోనున్నారు. కాగా కాళేశ్వరాలయంలో రాజకీయ వేడి రాజుకుంటోంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top