బెట్టింగ్‌ వేస్తే బ్యాటింగే!

Police have intensified intelligence on cricket betting in Hyderabad - Sakshi

బెట్టింగ్స్‌కు అడ్డుకట్ట వేయడానికి పోలీసుల చర్యలు

ఇప్పటి వరకు నిర్వాహకులు మాత్రమే అరెస్టు

ఇప్పుడు పందాలు కాసే వారు సైతం నిందితులుగా పరిగణన

ఎన్నికల బెట్టింగ్‌ నేపథ్యంలోఅధికారుల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఏ దేశంలో క్రికెట్‌ మ్యాచ్‌ జరిగినా హైదరాబాద్లో బుకీలు సిద్ధమైపోతారు.. ఏ జట్లు ఆడుతున్నా సరే పంటర్లు ఎగబడి మరీ పందేలు కాస్తుంటారు. పార్లమెంట్‌ నుంచి పంచాయితీ ఎన్నికల వరకు ఏం జరిగినా పందెం రాయుళ్లు పడగ విప్పుతారు.. గెలుపోటములపై బెట్టింగ్స్‌ నిర్వహిస్తుంటారు. తాజాగా రాష్ట్రంలోని పార్లమెంట్‌ స్థానాలతో పాటు గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ మధ్య పూర్తయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భారీ బెట్టింగ్‌ జరుగుతోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల బుకీలు, పంటర్లు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతున్న బెట్టింగ్‌లపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు బుకీలపై (పందేలు అంగీకరించే వారు) మాత్రమే కాదు.. పంటర్లనూ (పందేలు కాసే వ్యక్తులు) నిందితులుగా కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు.

ఇక్కడ పట్టు బిగిస్తే..
బుకీలు, పంటర్లకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. కొత్తగా బుకీలుగా మారే వారు గతంలో ప్రధాన బుకీల వద్ద పని చేసిన వారై ఉంటారు. తమ యజమానికి చెందిన కొందరు కస్టమర్లను తమ వైపునకు లాక్కొంటున్నారు. వీరిద్వారా పరిచయమైన వారినే కొత్త పంటర్లను కస్టమర్లుగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఉక్కుపాదం మోపితే బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్న బుకీలు తమ రెగ్యులర్‌ పంటర్ల సాయంతో యథేచ్ఛగా ‘ఆన్‌లైన్‌ దందా’ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంటర్లకు చెక్‌ చెబితే తప్ప బెట్టింగ్‌ దందాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం సాధ్యం కాదని పోలీసులు నిర్ణయించారు. పందెం కాసేవాళ్లే లేకపోతే అంగీకరించే వారు కూడా ఉండరని భావిస్తున్నారు. దీనికోసం కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.  

నోటీసుల జారీకి అవకాశం..
ఈ పందాలు కాసే వారిలో యువత ఎక్కువగా ఉంటున్నారు. వీరి బెట్టింగ్స్‌కు బానిసలుగా మారారనే విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలీదు. వీరిని కట్టడి చేస్తేనే బుకీలకు అడ్డుకట్ట వేయొచ్చు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు పంటర్లనూ నిందితుల జాబితాలో చేర్చాలని భావిస్తున్నారు. వీరిని అరెస్టు చేసే ఆస్కారం లేకపోయినా నోటీసులు పంపాలని యోచిస్తున్నారు. ఫోన్‌ నంబర్ల ఆధారంగా చిరునామాలు గుర్తించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఆపై నేర నిరూపణకు అవసరమైన ఆధారాలు లభిస్తే వారిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉంటుంది.

ఇలా చేస్తే వారి కుటుంబీకులకూ విషయం తెలియడంతో పాటు వీరి ఆగడాలకు అడ్డుపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘పందాలు కాసే వారు ఉన్నంత కాలం బుకీలు పుట్టుకు వస్తూనే ఉంటారు. ఇక్కడ దాడులు చేస్తే గోవా, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్లి వ్యవహారం నడుపుతున్నారు. పంటర్లను కట్టడి చేస్తే ఆటోమేటిక్‌గా బుకీల వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుంది. అందుకే కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు.

పక్కాగా దొరుకుతున్న ఆధారాలు
బెట్టింగ్‌ గ్యాంగ్స్‌ను టాస్క్‌ఫోర్స్, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ వంటి ప్రత్యేక బృందాలతో పాటు స్థానిక పోలీసులూ పట్టుకుంటున్నారు. ఇలాంటి గ్యాంగ్స్‌/వ్యక్తుల నుంచి పోలీసులు నగదుతో పాటు టీవీ, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, బెట్టింగ్‌ స్లిప్స్‌ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు పంటర్ల రికార్డులూ గుర్తిస్తుంటారు. పంటర్ల వద్ద దొరికిన ల్యాప్‌టాప్స్‌ విశ్లేషిస్తే మరికొందరు పంటర్ల పేర్లూ బయటికొస్తాయి. ఓ బుకీలను అరెస్టు చేస్తే పంటర్లు మరో బుకీ వద్ద పందాలు కాసే అవకాశం ఉందని భావించిన పోలీసులు పంటర్ల పైనా కఠిన చర్యలకు నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top