వరంగల్‌: సీసీ కెమెరాలే ఇక మా పెద్ద దిక్కు..

Police commissionerate CC Cameras For Elections In Warangal - Sakshi

కమిషనరేట్‌లో 21091 సీసీ కెమెరాలు 

జల్లెడ పడుతున్న నిఘా బృందాలు    

వినూత్న పద్ధ్దతుల్లో డబ్బుల పంపిణీ..? 

సాక్షి, వరంగల్‌: ఎన్నికల ఘట్టానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు ఒంటికాలుమీద నిల్చుని ప్రచారం కొనసాగిస్తున్నారనడంలో సందేహం లేదు. తమ గెలుపు కోసం ఏ ఒక్క అవకాశం వదులుకోవడం లేదు. ఎలాగైన గెలవాలనేది అన్ని పార్టీల అభ్యర్థుల ఏకైక లక్ష్యం. దీని కోసం కొత్త దారులను అన్వేషిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మద్యం.. డబ్బులను ఆశగా చూపుతున్నారు. దీంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరూ ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని అయోమయ పరిస్థితుల్లో అభ్యర్థులు ఉన్నారు. పొద్దంత ప్రచారం..రాత్రంత పంపిణీ అనే విధంగా ఎన్నికలు ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టే డబ్బులు, మద్యం ను అదుపు చేసేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ అధికారులతో పాటు పోలీసులు పలు విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం పోలీసు అధికారులకు పెద్ద దిక్కుగా మారాయి. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉండడం వల్ల ఏం జరిగినా క్షణాల్లో పోలీసులకు సమాచారం అందుతోంది. దీనికి తోడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై అడుగడుగునా ఎలక్షన్‌ కమిషన్‌ నిఘా పెట్టింది. నిబంధనలను అతిక్రమించిన వివిధ పార్టీల నేతలపై ఎక్కడికక్కడే కేసులు నమోదు చేస్తుంది. ఇప్పటికే అధికారులు ప్రతి నియోజకవర్గంలో రెండు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను జల్లెడ పడుతున్నారు. దీంతో లెక్క చూపని డబ్బు పెద్ద మొత్తంలో దొరుకుతుంది.
 
51 కేసులు నమోదు..  
ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో 51 కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల నియమాళిని ఉల్లంఘించిన వ్యక్తులు, నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్డ్‌ (ఎంసీసీ) కింది ఎన్నికల పర్యవేక్షకులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు నిరంతరం రాజకీయ పార్టీల ప్రచారం, వారి కార్యకలపాలపై నిఘా పెట్టి ఉంచారు. ఎక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగిన స్థానిక పోలీసు స్టేషన్‌ల్లో కేసులు నమోదు చేయిస్తున్నారు. కమిషనరేట్‌లోని సెంట్రల్‌ జోన్‌ పరిధిలో 27 కేసులు, వెస్ట్‌ జోన్‌ పరిధిలో 14 కేసులు, ఈస్ట్‌ జోన్‌ పరిధిలో 10 కేసులు నమోదు చేశారు. 2014లో జరిగిన ఎన్నికలలో కమిషనరేట్‌ పరిధిలో 133 కేసులు నమోదు చేశారు. వీటిలో 246 మందిపై చర్యలు తీసుకున్నారు.
 
నిఘా నేత్రాలు.. 
కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం అధికారులకు వజ్రాయుధంగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైన గొడవలు జరిగితే సీసీ కెమెరాల అధారంగా పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నారు. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 21091 కెమెరాలు ఉన్నాయి. ఇందులో మెజారిటీ సీసీ కెమెరాలను స్థానిక పోలీసు స్టేషన్‌లకు విరివిగా అనుసంధానం చేశారు.  

వినూత్న పద్ధతుల్లో.. 
ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు ఓటుకు నోటు అనే విధంగా ముందుగు సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రతి 100 మంది ఓటర్లకు ఒక నాయకుడిని ఎంపిక చేసుకున్నారు. డబ్బుల పంపిణీ, ఎన్నికల తేదీ వరకు వారి బాగోగులు చూసే బాధ్యతను ఆ నాయకుడికి అప్పగించారు. ప్రచార సమయంలో ప్రచారం ముగిసిన తర్వా త అందరినీ ఒక దగ్గరకు చేర్చి రూ.150 చొప్పున అందజేస్తున్నారు. దీంతో పాటు మగవారికి అదనంగా బీరు, బిర్యానీ అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులను పంపిణీ చేసేందుకు 20 రోజుల క్రితమే సిద్ధం చేసి ఉంచారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top