ఆర్టీసీ సమ్మె: అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి అరెస్ట్

Police Arrest RTC Workers At Gunpark - Sakshi

సాక్షి, హైదరాబాద్ : గన్‌ పార్క్‌ వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ అరెస్టులపై ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. గన్‌ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వస్తే అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమని, తమను అక్రమంగా అరెస్ట్ చేశారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. అరెస్టయిన జేఏసీ నేతలను వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని మహంకాళి పీఎస్‌కు తరలించగా.. జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డిని సైఫాబాద్‌ పోలీసు సేష్టన్‌కు తరలించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఆర్టీసీ యూనియన్‌ కార్యాలయానికి రాకుండా పోలీసులు భారీగా మోహరించారు.

గన్‌పార్క్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌ పార్క్‌ వద్ద నివాళులర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్ పార్క్ వద్దకు తరలివస్తున్నఆర్టీసీ కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గన్‌ పార్క్‌ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు మాత్రం తాము గన్‌ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివారులర్పించడానికి వచ్చామని, దీనికి అరెస్టు చేయడమేమిటని మండిపడుతున్నారు. మరికాసేపట్లో గన్‌ పార్క్ వద్దకు ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల నేతలు వచ్చే అవకాశముండటంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది.


తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరాహార దీక్ష చేపట్టాలనుకున్న ఆర్టీసీ జేఏసీ నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తలపెట్టిన ఆర్టీసీ జేఏసీ నిరాహార దీక్షను వాయిదా వేశారు.  పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  మరోవైపు సీఎం కేసీఆర్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన మొదలైంది.  ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు. టీఎస్‌ ఆర్టీసీలో కొత్త నియామకాల నేపథ్యంలో డ్రైవర్‌, కండక్టర్‌ అభ్యర్థులు డిపోల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top