వరాహ ‘దాడి’

Pigs Attack On Croplands Warangal - Sakshi

శాయంపేట(భూపాలపల్లి): అరకొర దిగుబడులతో రైతులు సతమతమవుతుంటే వన్యప్రాణుల బెడద గోరుపై రోకలి పోటులా మారింది. గుంపులు గుంపులుగా వస్తున్న అడవి పందులు జిల్లాలో పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను తింటూ వరాహాలు చిందరవందర చేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అడవుల దరిదాపుల్లో వ్యవసాయం రైతన్నలకు కత్తిమీద సాములా మారింది.

వన్యప్రాణుల విహారంతో పంటలను రక్షించుకునేందుకు కర్షకులు నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నారు. అడవి పందుల సంచారంతో మొక్కజొన్న, వేరుశనగ, కందులు, పెసర, పండ్ల జాతుల పంటలు ధ్వంసమవుతున్నాయి. జిల్లాలోని ఆత్మకూర్, పరకాల, శాయంపేట, దామెర, గీసుగొండ, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, సంగెం, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, నెక్కొండ మండలాల్లో కొండ, అటవీ, వాగుల ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో పందుల బెడద విపరీతంగా ఉంది. వాటి జోలికెళ్తే అటవీశాఖ అధికారులు కేసులు పెడతారమోనని భయపడుతున్నారు. ఒకదశలో రైతులపై దాడి చేసేందుకు ఎగబడుతున్నాయి. దీంతో రైతులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పంటలను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు.

వేల ఎకరాల్లో నష్టపోతున్న పంటలు..
వరంగల్‌ జిల్లాలోని 16 మండలాల వ్యాప్తంగా మొక్కజొన్న పంట ఈ ఏడాది 17,120 ఎకరాల్లో సాగు కాగా అరటి 312 ఎకరాల్లో, దోస 36 ఎకరాల్లో, టమాటా 430 ఎకరాలతో పాటు మొత్తంగా వివిధ కూరగాయ పంటలు 1930 ఎకరాల్లో సాగు అవుతుంది. అయితే అవి తినే కంటే ఎక్కువగా పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. సుమారు మొక్కజొన్న ఎకరం సాగు చేసేందుకు సుమారు రూ.18 వేలకు పైబడి పెట్టుబడి ఖర్చులు చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో మొక్కజొన్న పంట పీచు దశలో ఉండడంతో పందులు దాడులకు ఎగబడుతున్నట్లు రైతులు వాపోతున్నారు.

ఇతర జిల్లాల్లో మార్గాలు ఇలా..
అడవి జంతువుల నుంచి పంటలను పంటలను కాపాడేందుకు సంగారెడ్డి, మెదక్‌లో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని చోట్ల రైతులే వారి ఆలోచనలతో చిన్నచిన్న పద్ధతులతో పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకుని పంటలను కాపాడుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పంట చుట్టూ షా ఫ్లవర్‌ను ఏర్పాటు చే సుకుంటే వాటికి ముళ్లుండి పంటల్లోకి రాకుండా ఉంటాయి.

అలాగే పంట చుట్టూ కుళ్లిన కోడిగుడ్లు, వెంట్రుకలు, కారం పొడి చల్లడం వంటి చేస్తే అడవి పందుల బారి నుంచి కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. కొంత మంది రైతులు పంట చుట్టు ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పటికీ వాటికి కాపాలా రాత్రివేళల్లో రైతులు అక్కడే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎక్వగాన్‌ అనే కెమికల్‌ను తాడులో ముంచి పంట చుట్టూ కట్టేస్తే వాసనకు పంటల్లోకి పందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

రాత పూర్వకంగా ఫిర్యాదులు రాలేదు..
గుట్టలు, వాగులు, అటవీ ప్రాంతాల సమీపంలో ఉన్న పంటలపై అడవి పందులు దాడి చేస్తున్నట్లు వింటున్నాం. అయితే రైతులు ఇప్పటివరకు పంటలు నష్టపోయినట్లు రాత పూర్వకంగా ఫిర్యాదు రాలేదు. రైతులు కమ్యునిటీగా ఏర్పడి సోలార్‌ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకుంటే పంటలపై అటవి జంతువుల దాడికి యత్నించకుండా పంటలను కాపాడుకోవచ్చు. –ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయాధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top