‘డయల్‌ 100’ అదుర్స్‌!

People Trust Dial 100 Service in Hyderabad - Sakshi

ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ పోలీసుల పనితీరుపై నమ్మకం  

2017లో వచ్చిన కాల్స్‌ సంఖ్య 5.3 లక్షలు

ఈ ఏడాది ఆగస్టు నాటికి అవి 8.6 లక్షలు

నిత్యం 15 శాతం వరకు న్యూసెన్స్‌ కాల్స్‌  

సాక్షి,సిటీబ్యూరో: కంటి ముందు ప్రమాదం జరిగితే ఒకప్పుడు పోలీసులకు ఫోన్‌ చేయడానికి ఆలోచించే పరిస్థితి ఉండేది. వారు ఎప్పుడు వస్తారో? ఎలా ప్రవర్తిస్తారో? ఏం ప్రశ్నలు వేసి వేధిస్తారో? అనే భావన ప్రజల్లో ఉండేది. ఫ్రెండ్లీ పోలీసింగ్, జవాబుదారీతనం తదితర విధానాల తర్వాత పోలీసుల తీరు, స్పందనలో వచ్చిన మార్పుతో ప్రజల నుంచి సహకారం కూడా పెరుగుతోంది. గడిచిన రెండున్నర ఏళ్లుగా ‘డయల్‌–100’కు వస్తున్న ఫోన్‌కాల్సే ఇందుకు నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. 2017లో ఈ వ్యవస్థకు మొత్తం 5.3 లక్షల ఫోన్లు కాగా.. ఈ ఏడాది ఆగస్టు నాటికే ఆ సంఖ్య 8.6 లక్షలకు చేరింది. అయితే నిత్యం ‘100’ వస్తున్న న్యూసెన్స్‌ కాల్స్‌ సంఖ్య 15 శాతం, ఎంక్వయిరీ కాల్స్‌ మరో 15 శాతం వరకు ఉంటున్నాయి. 

ప్రజల కోసం పనిచేసేలా..
పోలీసులు సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి తీరు జనం మెచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో పోలీసు విభాగం కొన్ని వ్యవస్థల్ని ఏర్పాటు చేసింది. అందులో ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’తో పాటు ‘100’ నెంబర్‌తో కంట్రోల్‌ రూమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘100’ విధానానికి మరింత సాంకేతిక పరిజ్ఞానం, పాదర్శకత, జవాబుదారీతనం జోడిస్తూ ఆరేళ్ళ క్రితం ‘డయల్‌–100’ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఫోన్‌కాల్‌ను రికార్డు చేసే ఇక్కడి సిబ్బంది ఆ సమస్య పరిష్కారమయ్యాకే దాన్ని క్లోజ్‌ చేస్తారు. ఈ విధానంపై అనునిత్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంది. 2017లో హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ విధానం మరుసటి ఏడాది రాష్ట్రం మొత్తం విస్తరించింది. కంట్రోల్‌ రూమ్‌కు వచ్చే కాల్స్‌ను పోలీసు అధికారిక యాప్‌ ‘టీఎస్‌ కాప్‌’కు అనుసంధానించారు. ఫలితంగా ఓ కాల్‌ వచ్చిన తర్వాత ఎంత సేపటికి పోలీసులు స్పందించారు? ఆ సమస్యను ఎలా పరిష్కరించారు? తదితర అంశాలన్నీ పాదర్శకంగా అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులో ఉండేలా చేశారు. ఫలితంగా పోలీసుల్లో జవాబుదారీతనం పెరిగి ప్రతి ‘డయల్‌–100’ కాల్‌ను సీరియస్‌గా తీసుకోవడం, పక్కాగా స్పందించడం మొదలెట్టారు. దీంతో ఈ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగి తమ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్నీ పోలీసులకు తెలపడానికి ‘డయల్‌–100’ను వాడుకుంటున్నారు. 

30 శాతం ఆ కోవకు చెందినవే..
‘డయల్‌–100’కు రాష్ట్రం నలుమూలల నుంచి రోజూ వేల కాల్స్‌ వస్తుంటాయి. వీటిలో ఫోన్లలో బ్లాంక్‌ కాల్స్, న్యూసెన్స్‌ కాల్స్, అనవసర విషయాలతో ఇబ్బంది పెట్టే ఫోన్లూ అధికంగానే ఉంటున్నాయి. మొత్తం ఫోన్లలో 15 శాతం ఈ కోవకు చెందినవేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. వేళకాని వేళల్లో మద్యం మత్తులో కొందరు చేసే ఫోన్లు కంట్రోల్‌ రూమ్‌లో ఉన్న సిబ్బంది సహనాన్ని పరీక్షిస్తుంటాయి. అయినప్పటికీ ఏ దశలోనూ సహనం కోల్పోకుండా వింటున్న పోలీసులు వారు చెప్పే వాటిలోనూ ఆసక్తికర అంశాలు ఉన్నాయా? అనేది పరిశీలిస్తుంటారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. న్యూసెన్స్‌ కాల్స్‌ చేసే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా.. అలా చేయకుండా వీలున్నంత వరకు వారికి సర్దిచెప్పడానికి, ఫోన్‌ ద్వారా కౌన్సిలింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్‌ మీడియా, పోలీసు అధికారిక వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చినా.. ఇప్పటికీ ఫలానా అధికారి ఫోన్‌ నెంబర్‌ కావాలనో, ఫలానా పోస్టులో ఏ అధికారి ఉన్నారనో, ఆ పోలీసుస్టేషన్‌ ఎక్కడనో తెలుసుకోవడానికి ‘డయల్‌–100’ ఫోన్లు చేస్తున్న వారు వందల సంఖ్యలోనే ఉంటున్నారు. కొందరైతే ఏకంగా సిటీ బస్సుల సమాచారం, చిరునామాలు కోరుతూ కాల్స్‌ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారో, అక్కడ నుంచి వచ్చిన వారో ఇలాంటి కాల్స్‌ చేస్తే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నగరంలో నివసిస్తున్న విద్యాధికులు సైతం ఈ తరహాలో ఫోన్లు చేస్తుంటడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. 

విచిత్ర వేధింపులూ ఎక్కువే..
కంట్రోల్‌ రూమ్‌లో పనిచేసే సిబ్బందికి కొన్ని సందర్భాల్లో వేధింపులూ తప్పట్లేదు. కొందరు ఫోన్లు చేసి పోలీసు విభాగంతో సంబంధంలేని అంశాలు అడుగుతుంటారు. సిబ్బంది నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే దూషణలకు దిగుతూ అభ్యంతరకరంగా మాట్లాడుతుంటారు. కొందరు ఆకతాయిలైతే పదేపదే ఫోన్లు చేయడంతో పాటు ఏమీ మాట్లాడకుండా ఉండటమో, వెంటనే కట్‌ చేసేయడమో చేస్తుంటారు. వీటిని అధికారికంగా బ్లాంక్‌ కాల్స్‌గా పరిగణిస్తున్న సిబ్బంది పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి నెంబర్లను బ్లాక్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. భవిష్యత్‌లో వారికే ఏదైనా ఇబ్బంది ఎదురైతే వ్యవహారం ‘నాన్న పులి’ కథ మారదిగా మారుతుందనే ఉద్దేశంతో ‘డయల్‌–100’ సిబ్బంది ఉపేక్షిస్తున్నారు. 

తగ్గిన ‘బెదిరింపులు’
నగరంలో ఒకప్పుడు ఎక్కడపడితే అక్కడ కాయిన్‌ బాక్సులు ఉండేవి. వీటిని వినియోగించి ఎవరు ఫోన్‌ చేస్తున్నారు? ఎక్కడకు ఫోన్లు చేస్తున్నారు? అనే అంశాలపై సరైన పర్యవేక్షణ ఉండేది కాదు. దీంతో వీటిని వినియోగించే ఆకతాయిలు ఫలానా చోట బాంబు ఉందనో, మరోటి జరుగుతోందనో పోలీసుల్ని పరుగులు పెట్టించేవారు. ఈ కాయిన్‌ బాక్సుల మాదిరిగానే ఆ తరహా కాల్స్‌ సైతం గణనీయంగా తగ్గిపోయాయి. సెల్‌ఫోన్, ల్యాండ్‌లైన్ల నుంచి ఇలాంటి కాల్స్‌ చేస్తే బాధ్యుల్ని తేలిగ్గా గుర్తించి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. దీంతో ఈ తరహా ఆకతాయిలు వెనుకడుగు వేస్తున్నారు. నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కావడంతో ఉన్న కొన్ని కాయిన్‌ బాక్సుల్నీ ఈ తరహాలో ‘వినియోగించడానికి’ ఆకతాయిలు ధైర్యం చేయట్లేదు.  పోలీసుల స్పందన, జవాబుదారీతనంలో వచ్చిన మార్పు ప్రజలు గమనిస్తున్నారు. ఫలితంగా సమాచారం ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రజల భద్రత కోసం ఏర్పాటైన ‘డయల్‌–100’ను వినియోగించుకోవడంతో ఎవరికి వారు బాధ్యతగా మెలగాలి. ఆకతాయిల వల్ల పని గంటలు వృధా అవుతున్నాయి. ఆ ప్రభావం నిజంగా ఆపదలో చిక్కుకున్న వారిపై పడుతోందని కంట్రోల్‌ రూమ్‌కు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.

సిటీలో అందిన ఫోన్‌ కాల్స్‌ ఇవీ..
ఆగస్టు వరకు వచ్చిన కాల్స్‌     1.8 లక్షలు
బాడీలీ అఫెన్సులపై         22 శాతం
సౌండ్‌ పొల్యూషన్‌పై         21 శాతం
మహిళలపై నేరాలపై         13 శాతం
రోడ్డు ప్రమాదాలపై         10 శాతం  
సొత్తు సంబంధ నేరాలపై     5 శాతం  
న్యూసెన్స్‌ తదితరాలు         29 శాతం   

రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఫోన్‌ కాల్స్‌ సంఖ్య ఇలా..

ఏడాది        కాల్స్‌ సంఖ్య
2017        5,34,967
2018        8,76,998
2019 (ఆగస్టు)    8,68,059

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top