శభాష్‌ పోలీస్‌.. ఏడు నిమిషాల్లోనే.. | Sakshi
Sakshi News home page

శభాష్‌ పోలీస్‌..

Published Fri, Dec 6 2019 9:53 AM

Hyderabad Police React in Seven Minits to Dial100 Call Saved Suicide Victim - Sakshi

చిలకలగూడ : డయల్‌ 100కు సమాచారం అందిన ఏడు నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుకున్న పోలీసులు ఉరికి వేలాడుతున్న వ్యక్తిని సురక్షితంగా కాపాడిన సంఘటన చిలకలగూడ పరిధిలో చోటు చేసుకుంది. డీఐ సంజయ్‌కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిలకలగూడలో అక్బర్‌ఖాన్‌ (45) వహిదాబేగం దంపతులు నివాసం ఉంటున్నారు. అక్బర్‌ఖాన్‌  కార్పెంటర్‌గా పని చేసే వాడు. ఆర్థిక సమస్యల నేపథ్యంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.  గురువారం మధ్యాహ్నం కూడా వారి మధ్య మరోమారు ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న అక్బర్‌ ఖాన్‌ వహీదా బేగంపై దాడి చేయడంతో ఆమె డయల్‌ 100కు సమాచారం అందించింది. దీంతో మనస్తాపానికిలోనైన అక్బర్‌ఖాన్‌ గదిలోకి వెళ్లి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అయితే అప్పటికే  సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు క్షణాల్లో స్పందించారు. పెట్రోకార్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. తలుపులు కొట్టినా స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూడగా అక్బర్‌ఖాన్‌ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీంతో అప్రమత్తమైన కిరణ్‌కుమార్‌ గట్టిగా తన్నడంతో తలుపులు తెరుచుకున్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అక్బర్‌ఖాన్‌ను కిందికి దించి ప్రాథమిక చికిత్స అందించాడు. అనంతరం అతడిని 108లో గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించడంతో కోలుకున్నాడు. ఓ వ్యక్తిప్రాణా లు కాపాడిన కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌తోపాటు తక్షణ మే స్పందించిన చిలకలగూడ డీఐ సంజయ్‌కుమార్‌ను పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు. 

ఏడు నిమిషాల్లోనే..
అక్బర్‌ఖాన్‌ తనపై దాడి చేస్తున్నాడని అతడి భార్య వహీదాబేగం గురువారం ఉదయం 12 గంటల 38 నిమిషాల 37 సెకెన్లకు డయల్‌ 100కు ఫిర్యాదు చేసింది. 1.14 నిమిషాల్లో కాల్‌ను యాక్సెప్ట్‌ చేసిన సిబ్బంది చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. 12 గంటల 45 నిమిషాల 26 సెకెన్లకు అంటే ఫిర్యాదు చేసిన ఏడు నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అత్మహత్యాయత్నానికి పాల్పడిన అక్బర్‌ఖాన్‌ను కాపాడారు. చిలకలగూడ డీఐ సంజయ్‌కుమార్, ఎస్‌ఐలు రాజశేఖర్, విజయేందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కోలుకున్న అనంతరం అక్బర్‌ఖాన్‌తోపాటు అతని కుటుంబసభ్యులు, బంధువులకు అడ్మిట్‌ఎస్‌ఐ రవికుమార్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Advertisement
Advertisement