ముప్పు కూడా ఇన్‌స్టెంట్‌! | People Giving Importance To Processed Food In Metro Cities | Sakshi
Sakshi News home page

ముప్పు కూడా ఇన్‌స్టెంట్‌!

Jan 31 2020 5:08 AM | Updated on Jan 31 2020 5:08 AM

People Giving Importance To Processed Food In Metro Cities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చాక్లెట్‌ బార్స్, పిజ్జాలు, షుగర్‌ డ్రింక్స్, చికెన్‌ నగ్గెట్స్‌ వంటి వాటిని ఇష్టంగా లాగించేస్తున్నారా? ఇన్‌స్టాంట్‌గా వండుకునే ఆహార పదార్థాలను (రెడీ టూ ఈట్‌ మీల్స్‌) తింటున్నారా? ఇవన్నీ ఒక పరిధి వరకు తీసుకుంటే ఓకే. అంతకు మించితే రోగాల ముప్పు తప్పదంటున్నారు వైద్య నిపుణులు. రోజు వారీగా తీసుకునే అల్పాహారం, లంచ్, డిన్నర్‌లో వీటి మోతాదు 50% మించితే జీర్ణకోశ వ్యాధులు... మరీ శ్రుతి మించితే కేన్సర్‌ ముప్పు తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల దేశంలోని పలు మెట్రో నగరాల్లో అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వినియోగం 10% మేర పెరిగినట్లు కాల్‌ హెల్త్‌ అనే సంస్థ అధ్యయనంలో తేలింది. శుద్ధి చేసి నిల్వ ఉండేందుకు సంరక్షకాలను కలిపిన ఆహార పదార్థాలను అల్ట్రా ప్రాసెస్ట్‌ ఫుడ్‌ అంటారు. ఇలాంటి ఆహారపదార్థాల వినియోగం పెరిగిందని అధ్యయనంలో తేలింది. వీటిని తినడం వల్ల రోగాలు వచ్చే ప్రమాదం కూడా 12% పెరిగినట్లు వెల్లడైంది. దేశంలో ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వినియోగం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.  

ఆదమరిస్తే అంతే.. 
ఐటీ, బీపీవో, కేపీవో, సేవా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, నిర్మాణ, రియల్టీ రంగాలకు నిలయంగా మారిన మెట్రో నగరాల్లో నెటిజన్లు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. వీరు అల్పాహారం, లంచ్, స్నాక్స్, డిన్నర్‌ సమయాల్లో శుద్ధిచేసిన ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇంట్లో వండుకుని తీసుకొచ్చేందుకు సమయం చిక్కకపోవడంతోనే ఈ పరిస్థితి పునరావృతం అవుతోంది.

అయితే ఇది ఒక పరిధి వరకు అయితే ఓకే కానీ.. రోజువారీగా తీసుకునే ఆహారంలో 50 శాతం కంటే మించితే అనర్థాలు తప్పవని వైద్యులు అంటున్నారు. ఆయా ఆహార పదార్థాలు చూసేందుకు శుచిగా.. రుచిగా చూడగానే నోరూరించేట్లు ఉనప్పటికీ.. జిహ్వా చాపల్యం అదుపులో ఉంచుకోకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.  

అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ పదార్థాలివే.. 
►ఫ్రోజెన్‌ రెడీ టూ ఈట్‌ మీల్స్‌. ఇవి అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే ఆహార పదార్థాలు. వీటి ని ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సి వస్తుంది.  
►చికెన్‌ నగ్గెట్స్, పిజ్జా 
►అధిక మొత్తంలో నిల్వ చేసి ప్రాసెస్డ్‌ చేసిన బ్రెడ్‌ 
►చక్కెరతో తయారుచేసిన డ్రింక్‌లు 
►క్షణాల్లో రెడీ చేసుకునేందుకు వీలుగా ఉండే నూడుల్స్, సూప్స్‌ 
►చక్కెర కలిపిన తృణ, పప్పు ధాన్యాలు (షుగర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ సీరెల్స్‌) 
►చక్కెర మోతాదు అధికంగా ఉన్న స్నాక్స్, చిప్స్‌ 
►చాక్లెట్‌ బార్స్, స్వీట్స్‌

రోగాల ముప్పు ఇలా.. 
అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తయారీలో భాగంగా ముడి ఆహార పదార్థాలను వివిధ రీతుల్లో అత్యధికంగా వేడి చేసి శుద్ధిచేస్తారు. ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు చక్కెర, ఇతర సంరక్షకాలు, టేస్టింగ్‌ పౌడర్స్, ఫ్లేవర్స్, రంగులను అధిక మోతాదులో కలుపుతారు. వీటిని వండుకునే సమయం లో ఆయా ఆహార పదార్థాల నుంచి జీర్ణకోశ వ్యాధులు, కేన్సర్‌కు కారణమయ్యే సోడియం నైట్రేట్, టిటానియం ఆక్సైడ్‌లు వృద్ధి చెందుతాయి. దీంతో వ్యాధుల ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

మెట్రో నగరాల్లో ప్రాసెస్డ్‌ ఫుడ్‌ జోరు.. 
దేశంలోని పలు మెట్రో నగరాల్లో టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్‌ కోసం అల్ట్రా ప్రాసెస్డ్‌ వంటకాలను సిటిజన్లు కుమ్మేస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సిటిజన్లు ఆన్‌లైన్‌లోనే తమకు నచ్చిన బర్గర్స్, చికెన్‌ నగ్గెట్స్, చాక్లెట్‌ బార్స్‌ వంటి ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వెరైటీలను ఆర్డర్‌ చేస్తున్నట్లు ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తాజా సర్వేలోనూ తేలింది. ఆయా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఆర్డర్లను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసే విషయంలో సిటిజన్లు స్విగ్గీనే ఆశ్రయిస్తున్నారని ఆ సంస్థ పేర్కొంది.   

ఈ ఆహార పదార్థాలైతే బెటర్‌.. 
అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ కంటే ఇళ్లలో తయారుచేసుకునే బ్రెడ్, బిస్కట్లు, వెన్న, నెయ్యి వంటి ఆహార పదార్థాలైతే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రిఫ్రిజిరేటర్లలో నిల్వచేసిన ఆహార పదార్థాల కంటే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను తీసుకుంటే కేన్సర్‌ మప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అంటున్నారు. పప్పు దినుసులు, తాజా మాంసం కూడా తర చూ వినియోగిస్తే మంచిదని సూచిస్తున్నారు. పలు అంతర్జాతీయ వైద్య జర్నల్స్‌లోనూ పరిశోధకులు ఇవే అంశాలను తరచూ పేర్కొంటున్నారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement