పెన్షనర్లకు ఖాతా తప్పనిసరి | Pensioners must be have Savings account | Sakshi
Sakshi News home page

పెన్షనర్లకు ఖాతా తప్పనిసరి

Dec 20 2014 2:43 AM | Updated on Sep 2 2017 6:26 PM

పెన్షనర్లకు ఖాతా తప్పనిసరి

పెన్షనర్లకు ఖాతా తప్పనిసరి

పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా ‘ఆసరా’ పింఛన్లను పంపిణీ చేయాలని యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లబ్ధిదారులందరికీ పొదుపు ఖాతాలు ఉండేలా చర్యలు చేపడుతోంది.

పోస్టాఫీసు, బ్యాంకుల ద్వారా పంపిణీ కోసం ప్రభుత్వ ఆదేశం
మూడు నెలల్లోగా ఆధార్ సమర్పించకుంటే పింఛన్ నిలిపివేత
వీటిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచన
ఇప్పటివరకు 23.11 లక్షల మందికి రూ. 456.67 కోట్లు పంపిణీ

 
 సాక్షి, హైదరాబాద్: పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా ‘ఆసరా’ పింఛన్లను పంపిణీ చేయాలని యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లబ్ధిదారులందరికీ పొదుపు ఖాతాలు ఉండేలా చర్యలు చేపడుతోంది. ఇందు కు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మురళి శుక్రవారం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పింఛన్ల పంపిణీ తీరుపై క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సాంకేతిక సమస్యల కారణంగా పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోందని, మరికొంత గడువు కావాలని పలు జిల్లాల అధికారులు కోరారు. దీనిపై స్పందించిన సీఈవో మురళి.. ఈ నెల 25వ తేదీలోగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
 
ఆధార్ లేకుంటే అంతే!

పింఛన్ల లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను అందజేయాలని సెర్ప్ సీఈవో మురళి స్పష్టం చేశారు. ఆధార్ సమర్పించేందుకు ప్రభుత్వం 3 నెలల గడువు ఇచ్చినందున, ఆధార్ లేనివారు ఈలోగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. గడువులోగా ఆధార్ సమర్పించని వారికి ఆ తర్వాతి నెల పింఛన్‌ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై లబ్ధిదారులను అప్రమత్తం చేయాలని సూచించారు.
 
 కొత్త పింఛన్లు జనవరిలోనే..
 ఈ నెల 20వ తేదీ తర్వాత  మంజూరు చేసే పింఛన్లను వచ్చే జనవరి నెల నుంచే వర్తింపజేయాలని మురళి అధికారులకు సూచించారు. లబ్ధిదారుల జాబితాల్లో మరణించిన వారి పేర్లు, ఒకరి పేర్లు రెండు మార్లు రావడం, వలస వెళ్లిన వారి పేర్లు ఉండడం వంటివాటిని క్షేత్రస్థాయిలోనే తొలగించేందుకు సాంకేతిక ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా పెన్షనర్ల కేటగిరీని మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. పంపిణీ చేసిన పింఛన్లకు సంబంధించి లబ్ధిదారుల నుంచి తీసుకున్న రశీదు (అక్విటెన్స్)ల డేటా ఎంట్రీని 29వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి విభాగం నుంచి ఆయా మండలాల అధికారులకు కేటాయించిన నిధులు, అందిన నిధుల వివరాలను సరిచూసుకోవాలన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 23.11 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 456.67 కోట్లను పంపిణీ చేసినట్లు మురళి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement