ఇక వాస్తవిక వేతనం ఆధారంగా పింఛన్‌

Pension Basis As Per Actual wage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: ఎలాంటి గరిష్ట పరిమితి లేకుండా ఉద్యోగులు పదవీవిరమణ సమయానికి పొందుతున్న వాస్తవిక మూలవేతనం, డీఏ ఆధారంగా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులందరికీ పింఛన్‌ దక్కనుంది. ఈమేరకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఈపీఎఫ్‌వో తాజాగా నూతన విధానం రూపొందించనుంది. పింఛను లెక్కించేందుకు గరిష్ట పరిమితి విధానం కాకుండా పూర్తి వేతనాన్ని (చివరి మూల వేతనం, డీఏ) పరిగణనలోకి తీసుకోవాలంటూ.. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈపీఎఫ్‌ఓ దాఖలు చేసిన పిటిషన్‌ను.. సుప్రీంకోర్టు ఈనెల ఒకటో తేదీన తోసిపుచ్చింది. ఈపీఎఫ్‌వో దాఖలు చేసిన పిటిషన్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేవీ లేవని చెబుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో ప్రైవేటురంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పదవీ విరమణ పొందే సమయంలో తీసుకునే మూలవేతనం, డీఏ ఆధారంగా íపింఛన్‌ పొందే అవకాశం లభించింది.

పింఛన్‌ లెక్కింపు ఇలా!
ఇకపై ఉద్యోగి వాస్తవిక మూలవేతనం, డీఏను ఆధారంగా íపింఛన్‌ లెక్కిస్తారు. ఉద్యోగి సర్వీసును పరిగణనలోకి తీసుకుని నిర్ణీత ఫార్ములా ప్రకారం దీన్ని ఖరారు చేస్తారు. ఇప్పటివరకు ఈపీఎఫ్‌వో ఉద్యోగికి వేతనం ఎంత ఉన్నా పింఛన్‌ లెక్కించేందుకు గరిష్ట పరిమితి విధించింది. 2014 సెప్టెంబరు వరకు ఈ పరిమితి రూ.6,500గా ఉండేది. ఆ తదుపరి గరిష్ట పరిమితిని రూ.15 వేలకు పెంచింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. 2014 సెప్టెంబరు కంటే ముందుగా పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు చివరి వాస్తవిక వేతనం ఆధారంగానే పింఛన్‌ పొందేందుకు అర్హత ఉంది. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా 2014 తరువాత పదవీ విరమణ చేసే ఉద్యోగులకూ ఈ సూత్రం వర్తించనుంది. ఈ కారణంగా పదవీ విరమణ అనంతరం íపింఛన్‌ గణనీయంగా పెరగనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈపీఎఫ్‌వో కొత్త పింఛన్‌ విధానాన్ని రూపొందించాల్సి ఉంది. ఈమేరకు ఈపీఎఫ్‌ఓ మార్గదర్శకాలను విడుదల చేయాలి. వాటి ప్రకారం కొత్త విధానం అమల్లోకి వస్తుంది.

ఇలా పెరుగుతుంది!
ఇప్పటి వరకు గరిష్ట పరిమితి, సర్వీసు గుణించి దానిని 70తో భాగించడం ద్వారా పింఛన్‌ లెక్కించేవారు. అంటే గరిష్ట పరిమితి అయిన రూ.15 వేలను సర్వీసుతో గుణించి 70తో భాగించే వారు. 20ఏళ్ల సర్వీసు ఉంటే రూ.4,285గా లెక్కించేవారు. కానీ ఇకపై రూ.15 వేలు కాకుండా వాస్తవ వేతనం ఆధారంగా.. అంటే పదవీవిరమణ పొందే సమయంలో వాస్తవిక మూలవేతనం, డీఏ కలిపి రూ.40 వేలు, సర్వీసు 20ఏళ్లు ఉంటే రూ.11,428 చొప్పున íపింఛన్‌ లభిస్తుంది. మూలవేతనం, డీఏ, సర్వీసు పెరిగే కొద్దీ పదవీవిరమణ అనంతరం వచ్చే పింఛన్‌ పెరుగుతుంది.

ఈపీఎస్‌ సర్దుబాటు ఎలా?
ఉద్యోగులు మూలవేతనం, డీఏలో 12% తమవంతు వాటాగా ఈపీఎఫ్‌కు చెల్లిస్తారు. అంతేమొత్తాన్ని ఈ ఖాతాకు యాజమాన్యం జతచేస్తుంది.  యాజమాన్యం జమ చేసే 12% లో 8.33% íపింఛన్‌ పథకానికి (ఈపీఎస్‌) వెళ్తుంది. మిగిలిన సొమ్ము పీఎఫ్‌ ఖాతాకు వెళుతుంది. అంటే ఉద్యోగి రూ.1,800 చెల్లిస్తాడనుకుంటే.. యాజమాన్యం చెల్లించే రూ.1,800లో రూ.1,250 ఈపీఎస్‌కు, రూ.550 పీఎఫ్‌ ఖాతాకు వెళుతుంది. తాజా గా సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈపీఎస్‌కు వెళ్లే మొత్తం పెరుగుతుంది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్‌వో సవివరంగా మార్గదర్శకాలు జారీచేయాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top